Mukesh Ambani | న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ.. దేశంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. రూ.9,69,296 కోట్ల (116 బిలియన్ డాలర్లు) సంపదతో అగ్రస్థానంలో ఉన్నట్టు ఈ ఏడాదికిగాను తాజాగా విడుదలైన ఫోర్బ్స్ జాబితా పేర్కొన్నది. గత ఏడాదితో పోల్చితే 32 బిలియన్ డాలర్లకుపైగా పెరిగింది. నాడు 83.4 బిలియన్ డాలర్లే. ఈ క్రమంలోనే భారత్‌లోనేగాక ఆసియా దేశాల్లోనే అపర కుబేరుడి రికార్డును ముకేశ్ అంబానీ ఈసారి కూడా నిలబెట్టుకున్నారు. అంతేగాక 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ, ఆసియా వ్యక్తిగా కూడా చరిత్ర సృష్టించారు. కాగా, ప్రపంచ ధనవంతుల్లో ముకేశ్ అంబానీ 9వ స్థానంలో ఉన్నారు. ఇక దేశీయ శ్రీమంతుల్లో రెండో స్థానంలో అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ ఉన్నారు.
2023తో చూస్తే 47.2 బిలియన్ డాలర్ల నుంచి 84 బిలియన్ డాలర్లకు ఈయన సంపద ఎగబాకింది. ప్రపంచ ర్యాంక్ కూడా 17గా ఉన్నది. నిజానికి 2022లో 90 బిలియన్ డాలర్లతో అదానీ ఉన్నారు. అయితే హిండెన్‌బర్గ్ దెబ్బకు అదానీ గ్రూప్ మార్కెట్ విలువ నిట్టనిలువునా కరిగిపోయిన సంగతి విదితమే. ఇదిలావుంటే వరల్డ్ టాప్-100 డాలర్ బిలియనీర్లలో భారత్‌కు చెందిన 8 మందికి చోటు దక్కింది. అలాగే క్రిందటిసారితో చూస్తే దేశంలో కొత్తగా 31 మంది డాలర్ బిలియనీర్లు అవతరించారు. కాగా, ప్రపంచ కుబేరుడిగా ఎల్వీఎంహెచ్ సారథి బెర్నార్డ్ ఆర్నాల్ట్ 233 బిలియన్ డాలర్లతో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో ఎలాన్ మస్క్ (195 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్ (194 బిలియన్ డాలర్లు), మార్క్ జూకర్బర్గ్ (177 బిలియన్ డాలర్లు) నిలిచారు. గత నెల మార్చి 8న ఉన్న స్టాక్ ధరలు, ఎక్సేంజ్ రేట్ల ఆధారంగా ఈ ర్యాంకులను ఫోర్బ్స్ ఇచ్చింది.