Mukesh Ambani | భారత దిగ్గజ పారిశ్రామిక వేత్త, ఆసియాలోనే అత్యంత సంపన్నుడుగా పేరుగాంచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani ) గురించి ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంబానీకి ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన ఆస్తులు, విలాసవంతమైన ఇల్లు ఉన్న విషయం తెలిసిందే. అమెరికా, దుబాయ్ సహా పలు ప్రధాన నగరాల్లో రూ.కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. తాజాగా ఆయన అగ్రరాజ్యం అమెరికాలో ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం.
న్యూయార్క్ (New York) నగరంలో అత్యంత విలాసవంతమైన ఇంటిని ముకేశ్ అంబానీ కొనుగోలు చేసినట్లు తెలిసింది. ట్రైబెకా (Tribeca Building) ప్రాంతంలో టెక్ బిలియనీర్ రాబర్ట్ పెరాకు చెందిన ఈ ఇంటిని 17.4 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నారు. భారత కరెన్సీ ప్రకారం దాని విలువ రూ.153 కోట్లు అని సమాచారం. ఈ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అమెరికా విభాగం కొనుగోలు చేసినట్లు సమాచారం.
కాగా, ముకేశ్ అంబానీ రెండేండ్ల క్రితం న్యూయార్క్ ( New York) లోని మాన్‌హట్టన్ (Manhattan)లో విలాసవంతమైన ఇంటిని విక్రయించిన విషయం తెలిసిందే. మాన్‌హట్టన్ వెస్ట్ విలేజ్‌లో గల హడ్సన్ నదీ తీరాన అపార్ట్మెంట్లోని నాలుగో ఫ్లోర్లో 2,406 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లగ్జరీ ఇంటిని అంబానీ 9 మిలియన్ డాలర్లకు (భారత కరెన్సీ ప్రకారం.. రూ.74.5 కోట్లు) విక్రయించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ ఇంటిని విక్రయించిన రెండేళ్లకే న్యూయార్క్ నగరంలోనే మరో లగ్జరీ ఇంటిని అంబానీ కొనుగోలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఈ భవంతిని టెక్ బిలియనీర్ రాబర్ట్ పెరా 2018లో దాదాపు 20 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. దాన్ని లగ్జరీ హోమ్‌గా అభివృద్ధి చేయాలని భావించారు. కానీ ఆ ప్రణాళికలు కార్యరూపం దాల్చకపోవడంతో దాన్ని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 2021లో 25 మిలియన్ డాలర్లకు ఆ ఇంటిని విక్రయానికి పెట్టారు. తాజాగా, ముకేశ్ అంబానీ కుటుంబం ఈ భవంతిని సొంతం చేసుకుంది.
Also Read..
SpiceJet | స్పైస్‌జెట్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపుల్లో ఆలస్యం..!
IT Returns | ఐటీఆర్ గడువు పొడిగింపు..? స్పష్టతనిచ్చిన ఐటీ విభాగం
Vantara | ‘వంతారా’కు ‘సుప్రీం’ క్లీన్చిట్..!