Vantara | గుజరాత్ జామ్‌నగర్‌లోని వన్యప్రాణుల పునరావాస కేంద్రం వంతారాకు భారీ ఊరట కలిగింది. సుప్రీంకోర్టు కమిటీ క్లీన్చిట్ ఇచ్చింది. వంతారాలో నియమాలు, నియంత్రణా చర్యలు పాటించడంపై సిట్ సంతృప్తి వ్యక్తం చేసింది. జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ పీబీ వరలేలతో కూడిన ధర్మాసనం నివేదికను రికార్డుల్లోకి తీసుకొని.. వంతారాలో నియంత్రణ చర్యల అంశంపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొంది. కమిటీ నివేదికను శుక్రవారం సమర్పించగా.. సోమవారం సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించింది. నివేదికను అధ్యయనం చేసిన తర్వాత వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వంతారాలో చట్టాలను పాటించడం లేదని, విదేశాల నుంచి జంతువులను, ముఖ్యంగా ఏనుగులను స్వాధీనం చేసుకొని తరలిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఈ అంశంపై సుప్రీంకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు నమోదయ్యాయి. ఆయా పిటిషన్లపై విచారణ సమయంలో పలు మీడియా నివేదికల ఆధారంగా.. ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు ఒక సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆగస్టు 25న జస్టిస్ జే చలమేశ్వర్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో వంతారాలో జంతువులను అక్రమంగా కొనుగోలు చేసినట్లుగా ఆరోపించారు. వన్యప్రాణుల సంరక్షణ, పునరావాసం పేరుతో ఏనుగులు, పక్షులు, ఇతర జాతులను వంతారాకు అక్రమంగా తరలిస్తున్నట్లుగా పేర్కొన్నారు. భారత్‌తో పాటు వివిధ విదేశాల నుంచి జంతువులను తరలిస్తున్నారని.. ముఖ్యంగా ఏనుగులను స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. రిలియన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వంతారా ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. అనంత్ అంబానీ ఆలోచనలకు అనుగుణంగా జామ్‌నగర్ రిఫైనరీ గ్రీన్‌బెల్ట్‌లో 3వేల ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేశారు. ఇది సాధారణ జంతు ప్రదర్శనశా తరహాలో కాకుండా జంతువులకు సహజ వాతావరణాన్ని కల్పించేలా శాస్త్రీయంగా రూపొందించారు.