ముంబై, ఫిబ్రవరి 9: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. అమెరికా-భారత్ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు కావడంతో మదుపరుల్లో జోష్ పెంచింది. ఫలితంగా అన్ని రంగాల షేర్లు కదంతొక్కాయి. గత కొన్ని నెలలుగా టారిఫ్‌ల విధింపుపై నెలకొన్న అనిశ్చితి ముగింపు పలకడంతో సోమవారం ప్రారంభం నుంచే లాభాలబాట పట్టిన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఇంట్రాడేలో 700 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 84 వేల పాయింట్ల పైకి చేరుకున్నది.
చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 485.35 పాయింట్లు అందుకొని 84,065.75 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 26 వేల పాయింట్లకు చేరువైంది. 173.60 పాయింట్లు ఎగబాకి 25,867.30 వద్ద స్థిరపడింది. ట్రేడ్ డీల్ మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపిందని, అలాగే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం సెంటిమెంట్‌ను మరింత మెరుగుపరిచిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. కార్పొరేట్ల మూడో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలపై మదుపరులు దృష్టిసారించడం, ప్రభుత్వరంగ బ్యాంకులు అంచనాలకుమించి రాణించడం కూడా కలిసొచ్చింది. ఇటీవల కరెక్షన్కు గురైన రియల్ ఎస్టేట్, కన్జ్యూమర్ డ్యూరబుల్ షేర్లు తిరిగి కోలుకోవడం సూచీల్లో జోష్ పెంచిందన్నారు.
దేశీయ ఐటీ స్టాక్‌లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఏఐ ఆటోమేషన్ సంప్రదాయ అవుట్సోర్సింగ్ మాడల్ అందుబాటులోకి రావడం, ముఖ్యంగా ఈఆర్పీ అమలుతో ఈ రంగాలను దెబ్బతీస్తుందనే భయాలు నెలకొన్నాయి. దీంతో గత మూడు రోజుల్లో ఐటీ రంగ సూచీ 8 శాతం నష్టపోవడంతో ఆయా సంస్థల మార్కెట్ విలువ రూ.2.5 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఈఆర్పీ మాడల్ ఐటీ సంస్థల ఆదాయాన్ని 30-40 శాతం రిస్క్‌లో పడే అవకాశాలున్నాయని మోతీలాల్ ఒస్వాల్ అంచనావేస్తున్నారు.