మంగళవారం 02 మార్చి 2021
Business - Feb 08, 2021 , 01:22:08

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లలోనూ సొమ్ము భద్రమే

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లలోనూ సొమ్ము భద్రమే

బ్యాంకు ఖాతాలో మీరు చాలా కాలం నుంచి లావాదేవీలు నిర్వహించలేదా?  అలాంటప్పుడు ఆ ఖాతాలోని సొమ్ము ఏమవుతుందో తెలుసా? ఏ బ్యాంకు ఖాతాలోనైనా పదేండ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంపాటు ఎలాంటి లావాదేవీలు జరుగకపోతే ఆ ఖాతాలోని సొమ్మును ‘అన్‌క్లెయిమ్డ్‌' డిపాజిట్‌గా పరిగణిస్తారు. అనంతరం ఆ సొమ్మును రిజర్వు బ్యాంకు ఆధ్వర్యంలోని డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ ఫండ్‌కు బదిలీ చేస్తారు. ఇలాంటి అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు ఏటేటా భారీగా పెరుగుతున్నాయి.  అయినప్పటికీ ఆ డిపాజిట్లు భద్రంగానే ఉంటాయి. కస్టమర్లు లేదా వారి వారసులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ సొమ్మును తిరిగి పొందేందుకు వీలున్నది. 

అది ఎలాగంటే..

బ్యాంకుల్లోని పొదుపు ఖాతాలు, కరెంట్‌ ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లు, పే-ఆర్డర్ల లాంటి ఏ ఖాతాలోనైనా రెండేండ్లపాటు ఎలాంటి లావాదేవీలు జరుగకపోతే వాటిని ‘ఇనాపరేటివ్‌ అకౌంట్లు’గా పరిగణిస్తారు. అనంతరం ఆ బ్యాంకు ఈ విషయాన్ని ఈ-మెయిల్‌ లేదా ఫోన్‌ ద్వారా ఆయా కస్టమర్లకు తెలియజేస్తుంది. ఆ తర్వాత కూడా పదేండ్ల వరకు లేదా అంతకంటే ఎక్కువ కాలంపాటు ఎలాంటి లావాదేవీలూ జరుగకపోతే ఆ ఖాతాల్లోని సొమ్మును అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లుగా రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) వర్గీకరిస్తుంది. ఇలాంటి సొమ్మును వడ్డీతో కలిపి బ్యాంకులు ప్రతి నెలా ఆర్బీఐ డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ (డీఈఏ) ఫండ్‌కు బదిలీ చేస్తాయి. ఈ విధంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.33,114 కోట్లు, గతేడాది మరో రూ.25,747 కోట్లు డీఈఎఫ్‌కు బదిలీ అయినట్లు వార్షిక నివేదికలో రిజర్వు బ్యాంకు వెల్లడించింది. ఇలా వివిధ బ్యాంకుల నుంచి బదిలీ అయిన సొమ్మును ప్రభుత్వ సెక్యూరిటీల్లాంటి ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెడతారు. ఈ పెట్టుబడులను ఆర్బీఐ ఆధ్వర్యంలోని కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మదుపరుల్లో చైతన్యాన్ని పెంపొందించే కార్యక్రమాలతోపాటు డిపాజిట్లపై వడ్డీ చెల్లించేందుకు వినియోగిస్తారు. కాలక్రమంలో ఎవరైనా అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను తిరిగి పొందేందుకు ముందుకొస్తే ఆ డిపాజిట్లపై వాణిజ్య బ్యాంకుల్లోని రేట్ల ప్రకారం కాకుండా ఆర్బీఐ నిర్దేశించిన రేట్ల ప్రకారమే వడ్డీ చెల్లిస్తారు.

రశీదులు, గుర్తింపు పత్రాలు తప్పనిసరి

ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. అన్‌క్లెయిమ్డ్‌ ఖాతాల వివరాలను ప్రతి బ్యాంకూ తమ వెబ్‌సైట్‌లో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ వివరాలను పరిశీలించాక మీరు సొమ్మును క్లెయిమ్‌ చేయాలంటే పూరించిన క్లెయిమ్‌ ఫామ్‌తోపాటు సంబంధిత డిపాజిట్‌ రశీదులు, కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) పత్రాలతో ఆ బ్యాంకు శాఖను సంప్రదించాలి. ఈ క్లెయిమ్‌ చాలా పాత (డిజిటల్‌ బ్యాంకింగ్‌ సదుపాయాన్ని ఎనేబుల్‌ చేయని) ఖాతాకు సంబంధించినదైతే అప్పుడు మీరు ఆ హోమ్‌ బ్రాంచిని సంప్రదించడం మంచిది. ఒకవేళ మీరు వారసులైనా లేక నామినీగా ఉన్నా ఆ డిపాజిట్‌ రశీదులతోపాటు ఖాతాదారుని గుర్తింపు ధ్రువీకరణ, మరణ ధ్రువీకరణ ప్రతులతో బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. వీటన్నింటిని పరిశీలించాక మీ క్లెయిమ్‌ సరైనదేనని తేలితే ఆ ఖాతాలోని సొమ్మును బ్యాంకు విడుదల చేస్తుంది. 

ఎల్‌టీసీ నగదుపై పన్నుండదు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుసహా దేశంలోని లక్షలాది వేతన జీవులకు గొప్ప ఊరట లభించింది. లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌ (ఎల్‌టీసీ)కు బదులుగా పొందే నగదు అలవెన్సుపై పన్ను మినహాయింపును ఇటీవలి బడ్జెట్‌లో ప్రతిపాదించారు మరి. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ సవరణ అమల్లోకి రానున్నది. కరోనా వైరస్‌ దెబ్బకు అంతా స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గతేడాది ఎల్‌టీసీ క్యాష్‌ ఓచర్‌ స్కీమ్‌ను మోదీ సర్కారు ప్రవేశపెట్టింది. దీనికి పన్ను మినహాయింపును కల్పించగా, 2018-21 ఏండ్లకూ వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. నిజానికి నిరుడు అక్టోబర్‌ 12న ప్రభుత్వ ఉద్యోగులకే తొలుత ఈ స్కీమ్‌ను ప్రకటించారు. ఆ తర్వాత ప్రభుత్వేతర ఉద్యోగులకూ పొడిగించారు. కాగా, పేర్కొన్న వ్యవధి, ఖర్చులకు లోబడి ఈ పన్ను మినహాయింపు ఉంటుంది.

‘సరళ్‌ జీవన్‌'తో లాభాలెన్నో

సరళ్‌ జీవన్‌ బీమా పాలసీతో ఎన్నో లాభాలున్నాయి. ఈ పాలసీ ప్రతి ఒక్కరి నివాస, స్థలం, ప్రయాణం, వృత్తి, విద్యా అర్హతలతో సంబంధం లేకుండా వ్యక్తులకు వర్తించనున్నది. పాలసీ వ్యవధిలో బీమాదారుడు దురదృష్టవశాత్తు మరణిస్తే నామినీకి ఒకేసారి హామీ మొత్తం చెల్లించనున్నారు. 18 నుంచి 65 సంవత్సరాల లోపు కలిగిన వారు తీసుకునేవారు 5 నుంచి 40 సంవత్సరాల వ్యవధిలో చెల్లింపులు జరుపవచ్చును. గరిష్ఠ మెర్యూరిటీ వయస్సు 70 ఏండ్లు. హామీ మొత్తం కింద కనిష్ఠంగా రూ.5 లక్షలు, గరిష్ఠంగా రూ.25 లక్షలు అందించే అవకాశం ఉన్నది. ప్రీమియంను మాత్రం 5, 10 సంవత్సరాల్లో చెల్లింపులు జరుపుకునే అవకాశం ఉంటుంది.

VIDEOS

logo