హైదరాబాద్, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి గడిచిన ఏడాదికాలంలో టీజీఐపాస్ ద్వారా 1,901 యూనిట్లకు అనుమతులు మంజూరుకాగా, వీటిద్వారా రూ.12 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ పెట్టుబడులతో సుమారుగా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. ఈ అనుమతులు మంజూరైన వాటిలో 409 యూనిట్లు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. ఏడాది పాలన సందర్భంగా గురువారం మంత్రి పరిశ్రమల శాఖ సాధించిన ప్రగతి నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వీటితోపాటు మరో రూ.9,646 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 882 యూనిట్ల ఏర్పాటుకోసం దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇవికాకుండా రూ.200కోట్ల కన్నా అధిక పెట్టుబడి, వెయ్యి మందికి మించి ఉద్యోగావకాశాలు కల్పించే మెగా ప్రాజక్టులకు సంబంధించి 16 ప్రతిపాదనలు వచ్చినట్లు, వీటి ద్వారా రూ.14,433 కోట్ల పెట్టుబడులు, 9 వేల ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. ములుగు జిల్లాలో మూతపడిన బిల్ట్ పరిశ్రమను తిరిగి తెరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.