జహీరాబాద్, ఏప్రిల్ 19 : మహీంద్రా అండ్ మహీంద్రా.. తాజాగా ఈవీ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధమైంది. ఇందుకోసం జహీరాబాద్‌లో ఉన్న ట్రాక్టర్ల తయారీ కేంద్రంలో ఎలక్ట్రికల్ బ్యాటరీ తయారీ యూనిట్‌ను నెలకొల్పబోతున్నది. ఈ యూనిట్‌కు సంబంధించి ఈ నెల 24న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు, ప్లాంట్‌కు కావాల్సిన మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. గతంలో సీఎం కేసీఆర్ మహీంద్రా ప్లాంట్‌కు వచ్చి కొత్త వాహనాలను ప్రారంభించారు. ప్లాంట్ విస్తరణ చేసేందుకు మంత్రి కేటీఆర్ఎస్ వస్తున్నారనే సమాచారంతో ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికీ మహీంద్రా, స్వరాజ్ బ్రాండ్లతో ట్రాక్టర్లను విక్రయిస్తున్న సంస్థ..దేశీయ మార్కెట్‌కు మరో బ్రాండ్‌ను పరిచయం చేయబోతున్నట్టు ప్రకటించింది. త్వరలో ఓజా బ్రాండ్ ట్రాక్టర్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్నది. ఈ బ్రాండ్ ట్రాక్టర్లను జహీరాబాద్ ప్లాంట్‌లోనే తయారు చేయబోతుండటం విశేషం. ఈ నూతన బ్రాండ్‌లో 40 నూతన మాడళ్లను ఒకేసారి తీసుకోచ్చేందుకు ప్రణాళికను వేగవంతం చేసింది. తక్కువ బరువు కలిగిన ఈ ట్రాక్టర్లను భారత్‌తో పాటు అంతర్జాయ దేశాలైన అమెరికా, జపాన్, ఆసియాలోని పలు దేశాలకు ఎగుమతి చేయాలనుకుంటున్నది.