Microsoft Layoffs | ఆర్థిక మాంద్యం ముప్పు భయాలు ఇంకా టెక్ దిగ్గజ సంస్థలను వదల్లేదు. చాలా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెజాన్, గూగుల్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ సహా ప్రముఖ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగులను తగ్గించుకున్న విషయం తెలిసిందే. ఇంకా విడతల వారీగా తమ ఉద్యోగులకు లేఆఫ్స్ (Layoffs) ప్రకటిస్తూనే ఉన్నాయి. ప్రపంచంలోనే అగ్రశ్రేణి టెక్ జెయింట్ మైక్రోసాఫ్ట్ (Microsoft) తాజాగా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.
ఈ ఏడాది ప్రారంభంలోనే 10 వేల మంది ఉద్యోగులను (employees) తొలగిస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, రానున్న రోజుల్లో గతంలో ప్రకటించిన దానికంటే అదనంగా కోతలు ఉంటాయని తాజాగా వెల్లడించింది. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి వారం అనంతరం ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపింది. ఈ విషయాన్ని టెక్ దిగ్గజం సోమవారం ప్రకటించింది. అయితే, పెద్ద ఎత్తున తొలగింపులు ఉంటాయని ప్రకటించిన సంస్థ ఆ సంఖ్య ఎంతన్నది మాత్రం తెలియజేయలేదు.
‘మా వ్యాపార నిర్వహణలో సంస్థాగత, శ్రామిక శక్తి సర్దుబాట్లు తప్పనిసరి. అది సర్వసాధారణం. సంస్థ భవిష్యత్తు కోసం కస్టమర్లు, భాగస్వాములకు మద్దతుగా వ్యూహాత్మక వృద్ధి రంగాలకు ప్రాధాన్యమిస్తూ పెట్టుబడులు కొనసాగిస్తాం’ అని సంస్థ ప్రతినిధి తెలిపారు. కాగా, వాషింగ్టన్ (Washington) కార్యాలయంలోని ఉద్యోగుల్లో 276 మంది ఇప్పటికే లేఆఫ్స్ కు ప్రభావితులయ్యారు. అందులో 66 మంది వర్చువల్ గా పనిచేస్తున్నవారు ఉన్నారని సంస్థ తెలిపింది.
Also Read..
Dhanush | మద్రాస్ హైకోర్టులో నటుడు ధనుష్, ఐశ్వర్యలకు ఊరట..
School Bus | ఎస్యూవీ కారును ఢీ కొన్న పాఠశాల బస్సు.. ఆరుగురి మృతి
Himachal Pradesh | హిమాచల్ లో వరుణుడి బీభత్సం.. 30 మంది మృతి.. రూ.3వేల కోట్ల మేర నష్టం..!