Meta | మార్క్ జుకర్‌బర్గ్ ఆధీనంలోని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ (Facebook) మాతృసంస్థ అయిన మెటా (Meta) కు భారీ షాక్ తగిలింది. దాని అనుబంధ సంస్థ అయిన వాట్సాప్ ప్రైవసీ విధానం (WhatsApp policy) ద్వారా మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిన కారణంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (Competition Commission of India) మెటా ప్లాట్‌ఫామ్‌కు భారీ జరిమానా విధించింది. ఏకంగా రూ.213.14కోట్ల జరిమానా వేసింది.
అయితే, సీసీఐ నిర్ణయంపై మెటా తాజాగా స్పందించింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. సీసీఐ నిర్ణయంతో తాము ఏకీభవించడం లేదని తెలిపింది. 2021లో తీసుకొచ్చిన అప్డేట్ కారణంగా యూజర్ల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని తెలిపింది. దీనిపై అప్పీల్‌కు వెళ్లే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది.
కాగా, ప్రైవసీ విధానానికి సంబంధించి 2021లో తీసుకొచ్చిన అప్డేట్ ప్రకారం.. వాట్సప్ సేవలను పొందడం కొనసాగించాలంటే, ఇందులో లభించే డేటాను మెటా కంపెనీలతో పంచుకునేందుకు వినియోగదారులు తప్పనిసరిగా అంగీకరించాలి. 2016 నాటి విధానం ప్రకారం.. ఈ విషయంలో వినియోగదారులదే తుది నిర్ణయం. అయితే, అందుకు భిన్నంగా కొత్త విధానాన్ని అమలు చేసినందుకు ఈ మెటాకు సీసీఐ ఫైన్ వేసింది. ఇలాంటి పద్ధతులు సరికాదని, తమ వివరాలను మెటాతో పంచుకోవాలా, వద్దా అని నిర్ణయించుకునే హక్కును వినియోగదారులకు ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా ఇవ్వాలని సీసీఐ స్పష్టం చేసింది. ఐదేళ్ల వరకు ప్రకటనల ప్రయోజనాల కోసం మెటా కంపెనీలతో యూజర్ డేటాను పంచుకోవడం నిలిపివేయాలని వాట్సాప్‌ను సీసీఐ ఆదేశించింది.
Also Read..
Air Pollution | 500 మార్క్‌ను తాకిన గాలి నాణ్యత సూచి.. ఈ సీజన్లో ఇదే అత్యధికం
Cold Weather | రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత.. కోహిర్లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత