Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం (Air Pollution) ప్రమాదకరస్థాయికి చేరింది. తాజాగా ఢిల్లీ – ఎన్సీఆర్లో గాలి నాణ్యత సూచి 500 మార్క్‌కు చేరింది. మంగళవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) 494గా నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు కళ్ల మంటలు, దురద, గొంతు నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాజధాని ప్రాంతమంతటా గాలి నాణ్యత క్షీణించింది. నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో కాలుష్యం పెరిగింది. మంగళవారం ఉదయం పలు ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో ఏక్యూఐ లెవల్స్ 500 మార్క్‌ను తాకాయి. ఇది సివియర్ ప్లస్ కేటగిరీని సూచిస్తుంది. ద్వారకలో అత్యల్పంగా 480గా నమోదైంది. సోమవారం కూడా ఢిల్లీలో కాలుష్యం ఇదే స్థాయిలో నమోదైన విషయం తెలిసిందే. ఇవాళ వరుసగా రెండో రోజు కూడా దట్టమైన పొగమంచు కారణంగా భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
రాజధానిలో విషపూరిత పొగమంచు కారణంగా దృశ్యమానత పడిపోయింది. ముందు వెళ్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రాజధానికి రాకపోకలు సాగించే కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇవాళ ఉదయం దాదాపు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా.. మరో తొమ్మిది రైళ్లను అధికారులు రద్దు చేశారు.
ఏం చర్యలు తీసుకున్నారు.. ఢిల్లీ సర్కార్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం..
లుష్యం నియంత్రణకు ఎన్సీఆర్లోని రాష్ట్రాలు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ఏం చేశారంటూ సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. యాక్షన్ ప్లాన్ కింద కాలుష్య నియంత్రణ చర్యలను అమలు చేయడానికి కొంత తక్షణ అవసరమని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్‌కు సుప్రీంకోర్టు చెప్పింది. నాల్గో విడత ఎలాంటి ఆదేశాలు అడగకుండా తొలగించొద్దని కఠినమైన ఆదేశాలు ఇచ్చింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్-4ని తప్పనిసరిగా అమలు చేయాలని ఎన్సీఆర్ రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆంక్షలను పర్యవేక్షించేందుకు తక్షణమే టీమ్‌లను ఏర్పాటు చేయాలని చెప్పింది. జీఆర్పీలో పేర్కొన్న చర్యలపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. తదుపరి విచారణ వరకు నివారణ చర్యలను కోర్టుకు సమర్పించాలని చెప్పింది. నిబంధనలు ఉల్లంఘనలపై ఫిర్యాదులను పరిష్కరించేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని ఆదేశించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 కంటే తక్కువకు పడిపోయినప్పటికీ.. కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు యాక్షన్ ప్లాన్ అమలు కొనసాగుతుందని స్పష్టం చేసింది.
సుప్రీం ఆదేశాల మేరకు ఢిల్లీ – ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద నాలుగో దశ ఆంక్షలను విధించారు. ఇందులో భాగంగా ఢిల్లీలోకి ట్రక్కుల ప్రవేశాన్ని నిలిపివేశారు. పాఠశాలలు మూసివేసి, ఆన్లైన్ తరగతులు చెప్తున్నారు. ఇంత తీవ్రమైన కాలుష్యాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని ఢిల్లీ ప్రజలు చెప్తున్నారు. ఊపిరి తీసుకుంటున్నామో, పొగ తాగుతున్నామో అర్థం కానంతగా కాలుష్యం పెరిగిపోయిందని వాపోతున్నారు. మాస్కులు లేనిది ప్రజలు రోడ్డు మీదకు రావడం లేదు.
Also Read..
GSAT 20 | నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్-20 ఉపగ్రహం
FDI | బీమాలోకి 100 శాతం ఎఫ్‌డీఐ.. అనుమతించనున్న మోదీ సర్కారు!
Project Hyperion | ప్రాజెక్టు హైపేరియన్.. ఆకాశంలో అద్భుత నగరం!