Project Hyperion | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): హాలీవుడ్ సినిమా ‘2012’ చూశారా? భూకంపంలో భూమి మొత్తం నాశనమైతే, హీరో కుటుంబం సహా పలువురు స్పేస్షిప్స్లలో తలదాచుకొంటారు. ప్రకృతి విపత్తుల కారణంగా భూమిమీద నివసిస్తున్న జీవరాశులు నశిస్తాయన్నది చరిత్ర చెప్తున్న సత్యం. డైనోసార్లే దీనికి పెద్ద ఉదాహరణ. మానవ చర్యల వల్ల పర్యావరణంలో జరుగుతున్న పెను మార్పులు ప్రకృతి ప్రకోపానికి బాటలు వేస్తున్నాయి. దీంతో భూమిలాంటి మరో గ్రహాన్వేషణ అనివార్యంగా మారింది. ఈ క్రమంలోనే తెరమీదకు వచ్చింది.. ‘ప్రాజెక్టు హైపేరియన్’.
ఏమిటీ ప్రాజెక్టు?
రోదసిలో నిర్మించే నగరాన్నే ‘ప్రాజెక్టు హైపేరియన్’ లేదా ‘ప్రాజెక్టు టైటాన్’గా పిలుస్తున్నారు. భూమి మీద ఓ టౌన్లో ఉండే అన్ని రకాల సదుపాయాలు, వసతులు ఆకాశంలో ఓ స్పేస్‌షిప్‌లో ఉండే ఈ నగరంలోనూ ఉంటాయి. భూమి మీద వ్యవసాయం చేసినట్టే అక్కడా సాగు చేయొచ్చు. ఉద్యోగం, పిల్లల చదువులు, సినిమాలు-షికార్లు, రోగాలొస్తే దవాఖానలు, జంతువులు, చెట్ల పెంపకం ఇలా ఒక్కటేమిటీ అన్నిరకాల సదుపాయాలు ఆ నగరంలో అందుబాటులో ఉంటాయి. కనీసం 250 ఏండ్లపాటు మనుగడ సాగించేలా ఈ నగరాన్ని నిర్మించనున్నట్టు ‘ప్రాజెక్టు హైపేరియన్’ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది.
ఎందుకు ఈ ప్రాజెక్టు?
ప్రకృతి విపత్తులు, ప్రళయం, బయోవార్, కరోనా వంటి వైరస్ల వ్యాప్తి, అణుయుద్ధాలు వంటివి సంభవించినప్పుడు భూమి మీద జీవజాలం అంతరించిపోకుండా ఉండేందుకే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు.
సవాళ్లూ లేకపోలేదు
స్పేస్‌షిప్ నడవడానికి ఇంధనం, నగరంలో గాలి, నీటి శుద్ధి, వాతావరణ పరిస్థితులను సమతుల్యం చేయడం, రోదసిలోని రేడియేషన్ ప్రజలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, వ్యర్థాల నిర్వహణ ఇలా పలు సవాళ్లు ఈ ప్రాజెక్టు ముందడుగులో అడ్డుపడుతున్నాయి. అయితే, త్వరలోనే వీటికి తగిన పరిష్కారం చూపిస్తామని, దీనికోసం అవసరమైన సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నట్టు ‘ప్రాజెక్టు హైపేరియన్’ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఆసక్తి కలిగినవారు సవాళ్లకు పరిష్కారాలతో పాటు స్పేస్‌షిప్ డిజైన్లను జూన్ 2, 2025లోపు తమకు పంపించాలని విజ్ఞప్తి చేసింది.