Festive Season | పండుగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జూలై నెలలో వాహనాల సేల్స్ పుంజుకున్నాయి. దేశంలోకెల్లా అతిపెద్ద ప్రయాణికుల కార్ల సంస్థ మారుతి సుజుకి గతేడాదితో పోలిస్తే జూలై నెలలో 50.33 శాతం పెరిగాయి. గత నెలలో 1,62,462 కార్ల అమ్మకాలు జరిగాయి. దేశీయంగా 1,36,500 యూనిట్లు అమ్ముడైతే, విదేశాలకు 21,224 కార్లు ఎగుమతి చేసింది మారుతి సుజుకి.
గతేడాది జూలైలో మారుతి సుజుకి కార్ల విక్రయాలు 1,08,064 మాత్రమే. గత నెలలో కంపాక్ట్ సెగ్మెంట్లో వ్యాగనార్, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్, టూర్-ఎస్ వేరియంట్ కార్లు 70,268 కార్ల సేల్స్ జరిగాయి. గతేడాది 51,529 యూనిట్లకు పరిమితం అయ్యాయి. మినీ సెగ్మెంట్లో ఆల్టో, ఎస్-ప్రెస్సో సేల్స్ 17,258 నుంచి 19,685 యూనిట్లకు పెరిగాయి.
గతేడాదితో పోలిస్తే గత నెలలో టాటా మోటార్స్ కార్ల విక్రయాలు 92 శాతం పెరిగాయి. గతేడాది జూలైలో 27,024 కార్లు విక్రయించింది టాటా మోటార్స్. గత నెలలో అది 51,981 యూనిట్లకు చేరింది. ఈ ఏడాది జూన్ నెలతో పోలిస్తే గత నెల కార్ల విక్రయాలు 19 శాతం గ్రోత్ నమోదైంది. జూన్ నెలలో 43,704 కార్లు సేల్ అయ్యాయి.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ విక్రయాలు గత నెలలో 12 శాతం పెరిగాయి. 20202 జూలైలో 5,383 యూనిట్ల కార్లను విక్రయించి హోండా కార్స్.. ఈ ఏడాది జూలైలో 6,055 కార్లను విక్రయించింది.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా గత నెలలో 3080 కార్లను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో 234 శాతం గ్రోత్ నమోదు చేసుకున్నది. గతేడాది జూలైలో 922 కార్లు మాత్రమే విక్రయించింది. ఇందులో స్కోడా ఆటో ఇండియా ఎస్యూవీ కంపాక్ట్ కారు కుషాక్కు డిమాండ్ పెరిగింది.
కార్ల విక్రయాలు పెరిగినా.. గత నెలలో ప్రముఖ టూ వీలర్స్ సంస్థ హీరో మోటో కార్ప్స్ మోటారు బైక్లు, స్కూటర్ల అమ్మకాలు తగ్గాయి. 2020 జూలైలో 5,20,104 యూనిట్లు విక్రయించిన హీరో మోటో కార్ప్స్.. ఈ ఏడాది 4,54,398 యూనిట్లకు పరిమితమైంది.