న్యూఢిల్లీ, అక్టోబర్ 31: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.3,349 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,102.5 కోట్ల లాభంతో పోలిస్తే 8 శాతం వృద్ధిని కనబరిచింది.
దేశీయంగా విక్రయాలు పెరగడంతోపాటు ఎగుమతులు భారీగా పుంజుకోవడం వల్లనే లాభాల్లో వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. క్రితం ఏడాది రూ.37,449.2 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం ఈసారి త్రైమాసికానికిగాను రూ.42,344.2 కోట్లకు ఎగబాకినట్టు వెల్లడించింది. మరోవైపు, నిర్వహణ ఖర్చులు రూ.33,879.1 కోట్ల నుంచి రూ.39,018.3 కోట్లకు పెరిగాయి.
గత త్రైమాసికంలో దేశీయంగా కంపెనీ విక్రయాలు 5 శాతం తగ్గి 4,40,387 యూనిట్లకు పరిమితమవగా, అలాగే ఎగుమతులు 42 శాతం ఎగబాకి 1,10,487 యూనిట్లకు చేరుకున్నాయి. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగం(ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో) మారుతి 10,78,735 యూనిట్ల వాహనాలను విక్రయించింది. వీటిలో దేశీయంగా 8,71,276 యూనిట్లు కాగా, 2,07,459 వాహనాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది.