న్యూఢిల్లీ, ఏప్రిల్ 25 : కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీకి ఖర్చుల సెగ గట్టిగానే తగిలింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన ఒక్క శాతం తగ్గి రూ.3,911 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇది రూ.3,952 కోట్లుగా ఉన్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.38,371 కోట్ల నుంచి రూ.40,920 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. గత త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ ఖర్చులు రూ.37,585 కోట్లకు పెరగడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది. అలాగే 6,04,635 వాహనాలను విక్రయించింది. మరోవైపు, 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1,52,913 కోట్ల ఆదాయంపై రూ.13,955 కోట్ల నికర లాభాన్ని గడించింది. మరోవైపు, ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా సమావేశమైన కంపెనీ బోర్డు వాటాదారులు భారీ స్థాయిలో సంపదను పంచింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.135 డివిడెండ్‌ను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇచ్చిన రూ.125 కంటే ఇది అధికం. సంస్థ చరిత్రలో ఇంతటి స్థాయిలో డివిడెండ్ అందించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం.