ముంబై, ఏప్రిల్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ పరుగులు పెడుతుండటం, ఐటీ రంగ షేర్లలో భారీగా అమ్మకాలు చోటు చేసుకోవడంతో వారాంతపు ట్రేడింగ్‌లోనూ సూచీలు ఒక్క శాతానికి పైగా పతనం చెందాయి. విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, గ్లోబల్ మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతుండటం సూచీల పతనానికి ఆజ్యంపోశాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి.
ఇంట్రాడేలో 1,200 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 999.79 పాయింట్లు లేదా 1.29 శాతం నష్టపోయి 76,664.21 వద్ద ముగిసింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 275.10 పాయింట్లు లేదా 1.14 శాతం కోల్పోయి 23,897.95 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలతో మదుపర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. లక్షల కోట్ల సంపద హారతి కర్పూరంలా కరిగిపోతున్నది.
వరుసగా మూడు రోజుల్లో వీరి సంపద రూ.7.17 లక్షల కోట్లు ఆవిరైపోయింది. వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ 2,609.12 పాయింట్లు(3.29 శాతం) నష్టపోవడంతో బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.7,17,476.54 కోట్లు కరిగిపోయి రూ.4,61,49,758.18 కోట్లు(4.89 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది. పెట్టుబడిదారుల్లో నమ్మకం సన్నగిల్లడంతో అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారని, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతుండటం సెంటిమెంట్‌ను నీరుగార్చిందని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించారు.