Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు దీపావళికి ముందు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, చమురు స్టాక్స్‌తో పాటు విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో వరుసగా మూడోరోజు మార్కెట్లు లాభపడ్డాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 83,331.78 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 83,206.08 పాయింట్ల కనిష్టానికి చేరగా.. 84,172.24 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు 484.53 పాయింట్ల లాభంతో 83,952.19 వద్ద ముగిసింది. అయితే, ఈ ఏడాది జూన్ 30 తర్వాత తొలిసారిగా సెన్సెక్స్ 84వేల పాయింట్లను తాటింది. నిఫ్టీ 124.55 పాయింట్ల లాభంతో 25,709.85 వద్ద స్థిరపడింది.
మహీంద్రా అండ్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, ఐటీసీ, హిందుస్తాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, ఎటర్నల్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పెరిగాయి. వారంలో బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కొక్కటి 1.7 శాతం పెరగ్గా.. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 2 శాతం పెరిగింది. మీడియా, ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు 0.5-1శాతం తగ్గాయి. ఆటో, బ్యాంక్, హెల్త్‌కేర్, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.5 నుంచి ఒకశాతం పెరిగాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి సానుకూలంగా ముగియగా.. జపాన్ నిక్కీ 225 ఇండెక్స్, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హాంగ్ సెంగ్ నష్టాల్లో ముగిశాయి.