Stock Market | ముంబై, సెప్టెంబర్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. రికార్డు స్థాయిలో దూసుకుపోయిన సూచీల ర్యాలీకి భారీ బ్రేక్‌పడింది. అంతర్జాతీయ మార్కెట్లు సృష్టించిన అలజడి కారణంగా మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా శుక్రవారం సూచీలకు బ్లాక్‌డేగా నిలిచింది. నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు సమయం గడుస్తున్నకొద్ది మరింత ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడుతున్నట్లు వచ్చిన సంకేతాలకు తోడు ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గింపును వాయిదావేసే అవకాశం ఉన్నట్లు వచ్చిన వార్తలు మదుపరులపై ఆందోళనకు నెట్టింది.
ఇంట్రాడేలో 1,200 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 1,017 పాయింట్లు నష్టపోయి 82 వేల దిగువకు పడిపోయింది. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 81,183.93 వద్ద ముగిసింది. దీంతో సూచీ రెండువారాల కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు అయింది. ఆగస్టు 23 తర్వాత సూచీలకు ఇదే కనిష్ఠ స్థాయి ముగింపు. మరో సూచీ నిఫ్టీ 292.94 పాయింట్లు(1.17 శాతం) నష్టపోయి 25 వేల దిగువకు 24,852.15 పాయింట్ల వద్ద ముగిసింది.
సూచీలు వరుసగా నష్టపోవడం ఇది మూడో రోజు. ఐటీ, చమురు అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లలో జోరుగా క్రయవిక్రయాలు జరిగాయి. సోమవారం చారిత్రక గరిష్ఠ స్థాయి 82,725.28 పాయింట్లకు చేరుకున్న సూచీ ఆ మరుసటి రోజు నుంచి దిగువముఖంగా పయనించింది.
బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ షేరు అత్యధికంగా 4.40 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడం ఇందుకు కారణమని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు ఒక్క శాతం వరకు నష్టపోయాయి.
పెట్టుబడిదారులకు శుక్రవారం బ్లాక్ ఫ్రైడేగా నిలిచింది. దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో మదుపరులు 5 లక్షలకోట్లకు పైగా సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.5,49,925.16 కోట్లు కరిగిపోయి రూ.4,60,18,978.09 కోట్లకు(5.48 ట్రిలియన్ డాలర్లకు) పడిపోయింది.