Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఫైనాన్సియల్, రియాలిటీ షేర్లు రాణించాయి. ఆటో, మీడియా స్టాక్స్ లాభాల స్వీకరణకు దిగడంతో ఇంట్రాడేలో వచ్చిన లాభాలన్నీ ఆవిరయ్యాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,504.36 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 81,235.42 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్.. అత్యధికంగా 81,643.88 పాయింట్ల వరకు చేరింది. చివరకు 323.83 పాయింట్ల లాభంతో 81,425.15 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 104.5 పాయింట్లు పెరిగి 24,973.10 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.7శాతం వరకు పెరిగాయి.
నిఫ్టీలో భారత్ ఎలక్ట్రానిక్స్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్ లాభాలను ఆర్జించాయి. అయితే, ఎంఅండ్ఎం, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, మారుతి సుజుకీ, టాటా మోటార్స్ నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే ఆటో ఇండెక్స్ ఒకశాతం, ఐటీ ఇండెక్స్ 2.6శాతం వృద్ధిని నమోదు చేసింది. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2.2శాతం, రియాలిటీ ఇండెక్స్ ఒకశాతం దాకా పెరిగింది. అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ షేర్లు 16శాతం ర్యాలీ చేశాయి. అవంతి ఫీడ్స్ 15శాతం, కోస్టల్ కార్పొరేషన్ షేర్లు 20శాతం, గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్ 4శాతం పెరిగాయి. వెల్స్పన్ లివింగ్ 8, అరవింద్ షేర్లు 4శాతం వృద్ధిని నమోదు చేశాయి.