Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇటీవల అమెరికాలో అమెరికా మాంద్యం భయాలతో మార్కెట్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. తాజాగా బెంచ్ మార్క్ సూచీలు కోలుకొని మరోసారి లాభాల బాటలో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ బుధవారం 79వేల మార్క్‌ను అధిగమించింది. అదే సమయంలో నిఫ్టీ సైతం 24వేల పాయింట్లు దాటింది. మరో వైపు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించే ద్రవ్యవిధాన పరపతి సమీక్ష జరుపుతున్నది. గురువారం ఆర్బీఐ పాలసీని ప్రకటించనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు మంచి లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ ఉదయం క్రితం సెషన్‌తో పోలిస్తే 79,565.40 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 79,639.20 పాయింట్ల గరిష్ఠానికి చేరుకోగా.. అత్యల్పంగా 79,106.20 పాయింట్లకు చేరింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,696 షేర్లు పురోగమించాయి. 698 షేర్లు పతనం కాగా.. 72 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సిప్లా విప్రోలు లాభాపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, బ్రిటానియా, టెక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ నష్టపోయాయి. మెటల్, హెల్త్‌కేర్, మీడియా, పవర్, టెలికాం, ఆయిల్, గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ 2 నుంచి 3శాతంతో అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2శాతం చొప్పున వృద్ధిని నమోదు చేశాయి.