న్యూఢిల్లీ, ఆగస్టు 6: బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభంపై భారతీయ వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. పొరుగు దేశంలో కర్మాగారాలను నడిపిస్తున్న, వ్యాపారాలను నిర్వహిస్తున్న దేశీయ కంపెనీలు.. తమ ఉత్పత్తి, ఆర్డర్ల డెలివరీపై బెంగ పెట్టుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నడుమ బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అల్లరి మూకలు విధ్వంసం సృష్టిస్తుండటంతో అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. మార్కెట్ మూతబడగా, వ్యాపారం ఆగిపోయింది. పరిశ్రమల్లో ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. దీంతో వివిధ రంగాలపై ఆ ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నది.
బంగ్లాదేశ్ పరిస్థితులు భారతీయ టెక్స్టైల్, దుస్తుల రంగాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. అక్కడి అల్లర్లు, హింస రవాణా వ్యవస్థను స్తంభింపజేయడంతో అటు నుంచి ఇటు రావాల్సిన సరకుల సైప్లె నిలిచిపోతున్నదని మంగళవారం భారతీయ టెక్స్టైల్ పరిశ్రమ సమాఖ్య (సీఐటీఐ) ఆందోళన వెలిబుచ్చింది. బంగ్లాదేశ్‌లో ఫ్యాక్టరీలను నిర్వహిస్తున్న భారతీయ సంస్థలకు ప్రస్తుతం అక్కడి పరిస్థితులు సవాలేనని వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. సరఫరా లేక మార్కెట్ డిమాండ్‌ను అందుకోలేకపోతున్నాయని సీఐటీఐ పేర్కొన్నది.
మరోవైపు బంగ్లా సంక్షోభం.. భారత్‌లో వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా ఉన్న తిరుప్పూర్‌కు లాభిస్తుందన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. అక్కడి నుంచి సరకు రాకపోతే ఇక్కడ తయారీ మరింత పుంజుకోవచ్చంటున్నారు. కాగా, భారతీయ టెక్స్‌టైల్స్‌కు బంగ్లాదేశ్ కీలక మార్కెట్‌గా వర్ధిల్లుతున్న సంగతి విదితమే. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడి దుస్తుల తయారీ పరిశ్రమకు పేరున్నది. భారత్ నుంచే ఇక్కడికి నూలు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నది.
బంగ్లాదేశ్‌లో వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలతో సంబంధాలున్న భారతీయ సంస్థల షేర్లు.. దేశీయ స్టాక్ మార్కెట్లలో విపరీతంగా నష్టాలను చవిచూస్తున్నాయి. సఫోలా వంటనూనెల తయారీదారు మారికో షేర్ ధర 6 శాతానికిపైగా పడిపోయింది. కంపెనీ రెవిన్యూలో బంగ్లాదేశ్ అమ్మకాల వాటా 11-12 శాతంగా ఉండటమే కారణం. అక్కడి అల్లర్లతో వ్యాపారం నిలిచిపోయింది.
ఇదే తరహాలో పెర్ల్ గ్లోబల్ ఇండస్ట్రీస్, ఇమామీ, బాయర్ కార్ప్, జీసీపీఎల్, బ్రిటానియా, వికాస్ లైఫ్‌కేర్, డాబర్, ఏషియన్ పెయింట్స్, పిడిలైట్, జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్, బజాజ్ ఆటో షేర్లు నష్టపోతున్నాయి. టాటా మోటర్స్, హీరో మోటోకార్ప్ సేల్స్ కూడా బంగ్లాదేశ్‌లో భారీగానే జరుగుతున్నాయి. అయితే భారత్‌పైనే ఆధారపడి వ్యాపారం చేస్తున్న టెక్స్టైల్, దుస్తుల కంపెనీల షేర్లకు డిమాండ్ ఏర్పడింది. ఆయా సంస్థల వ్యాపారం పెరుగుతుందన్న అంచనాలే ఇందుకు కారణం.
బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. అక్కడి పరిణామాలన్నింటినీ నిశితంగా గమనిస్తున్నాం. టెక్స్టైల్ రంగంలో బంగ్లాదేశ్ వృద్ధిరేటు ఆదర్శనీయం. మొత్తం ఉపఖండం వాణిజ్యానికే అది బలం. కానీ ఇప్పుడు అక్కడ సంక్షోభం నెలకొన్నది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. భారత్‌లో ఉత్పత్తి, సరఫరాపై ఆ ప్రభావం పడుతున్నది. పరిస్థితులు త్వరలోనే చక్కబడుతాయని ఆశిస్తున్నాం.
-చంద్రిమా చటర్జీ, సీఐటీఐ ప్రధాన కార్యదర్శి