న్యూఢిల్లీ, ఆగస్టు 6: పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఈ ఏడాది జూలై 23 కంటే ముందు ఇండ్లను కొనుగోలు చేసినవారు.. వాటిని అమ్ముకున్నప్పుడు చెల్లించే దీర్ఘకాల మూలధన లాభాల (లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లేదా ఎల్టీసీజీ) పన్నుకు సంబంధించి ఉన్న కొత్త, పాత విధానాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు మంగళవారం లోక్‌సభలో సభ్యులకు అందించిన ఆర్థిక బిల్లు-2024లో సవరణలు చేసింది. దీంతో వ్యక్తులు లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) ఇండెక్సేషన్ బెనిఫిట్‌తో 20 శాతం పన్ను లేదా అది లేకుండా 12.5 శాతం పన్ను ఏది లాభమైతే అది ఎంచుకునే వీలుంటుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను గత నెల 23న లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రాపర్టీస్‌పై ఎల్టీసీజీ పన్నును 20 నుంచి 12.5 శాతానికి తగ్గించి దానికున్న ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 2001 ఏప్రిల్ 1 తర్వాత కొన్న ఇండ్లకు ఇండెక్సేషన్ ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. దీంతో అటు స్థిరాస్తి క్రయవిక్రయదారుల నుంచి ఇటు నిర్మాణ రంగ వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది.
దీనిపై పునరాలోచనలోపడ్డ మోదీ సర్కారు వెనక్కి తగ్గుతూ తాజా సవరణల్ని తీసుకొచ్చింది. బడ్జెట్లో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పన్ను చెల్లింపుదారులపై అదనపు భారం పడుతుందని, ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను ఉంచాల్సిందేనని ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. అయితే జూలై 23 కంటే ముందు ఇండ్లు కొన్నవారికే ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను అందించడం సరికాదని, మొత్తం బడ్జెట్ నిర్ణయాన్నే ఉపసంహరించుకోవాలన్న డిమాండ్లూ వ్యక్తమవుతున్నాయి.