న్యూఢిల్లీ, జూన్ 30: దేశంలో పారిశ్రామికోత్పత్తి పడకేసింది. ప్రధాన రంగాల్లో వృద్ధిరేటు మునుపటితో పోల్చితే దారుణంగా పడిపోయింది. కీలకమైన తయారీ, గనులు, విద్యుత్తు రంగాల్లో ఉత్పాదకత భారీగా క్షీణించడం గమనార్హం. ఈ ఏడాది మే నెలలో తయారీ రంగ ఉత్పాదక రేటు 2.6 శాతానికి పరిమితమైంది. గనుల రంగంలోనైతే మైనస్ 0.1 శాతంగా నమోదవగా.. విద్యుదుత్పత్తి 5.8 శాతంగా ఉన్నది. నిరుడు మే నెలలో ఇవి వరుసగా 5.1 శాతం, 6.6 శాతం, 13.7 శాతంగా ఉండటం విశేషం. ఈ క్రమంలోనే ఈసారి మే నెలలో దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 9 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 1.2 శాతం వద్దే ఆగిపోయింది. ఈ మేరకు సోమవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల్లో తేలింది. గత ఏడాది ఆగస్టు తర్వాత ఈ స్థాయిలో గణాంకాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక 2024 మే నెలలో ఐఐపీ 6.3 శాతంగా ఉన్నది.
2.7% కాదు 2.6 శాతమే
ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించిన ఐఐపీ గణాంకాలను జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) సవరించింది. అంతకుముందు నెలకుగాను మే నెలలో విడుదలైన దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ వృద్ధిరేటును 2.7 శాతంగా పేర్కొన్నారు. అయితే దాన్నిప్పుడు 2.6 శాతానికి తగ్గించారు. ఇదిలావుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి రెండు నెలల్లో (ఏప్రిల్-మే)నూ ఐఐపీ వృద్ధిరేటు 1.8 శాతానికి దిగజారింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఏప్రిల్-మే నెలల్లో ఇది 5.7 శాతంగా నమోదైంది మరి.
మార్కెట్లో నిస్తేజం
ఓవైపు పారిశ్రామికోత్పత్తి క్షీణత.. మరోవైపు మార్కెట్లో నెలకొన్న నిస్తేజం మందగిస్తున్న వ్యాపారాలు.. దేశ ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు ప్రమాదంలో పడేస్తున్నాయి. నిజానికి ఈసారి వర్షాలు ముందుగానే మొదలైనా.. ఆ తర్వాత ముఖం చాటేశాయి. అయితే మే నెలలో కురిసిన వర్షాలు గనుల రంగాన్ని దెబ్బతీశాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితీ నాయర్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘గనుల రంగంలోని కార్యకలాపాలను ముందస్తు వర్షాలు అడ్డుకున్నాయి. దీంతో ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ ప్రభావం విద్యుదుత్పత్తిపైనా పడింది’ అన్నారు. ఫలితంగా క్యాపిటల్ గూడ్స్ రంగంలో గణనీయమైన వృద్ధి కనిపించినా.. ఓవరాల్గా ఐఐపీని ఆదుకోలేకపోయిందన్నారు.