న్యూఢిల్లీ, మే 16: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. వచ్చే మూడేండ్లకాలంలో రూ.37 వేల కోట్ల పెట్టుబడితోపాటు దేశీయ మార్కెట్లోకి 23 నూతన వాహనాలను విడుదల చేయబోతున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో అనిశ్ షా తెలిపారు.
విడుదల చేయనున్న వాహనాల్లో తొమ్మిది ఇంటర్నల్ కంబ్యుస్టాన్ ఇంజిన్(ఐసీఈ) ఎస్యూవీ, ఏడు బ్యాటరీతో నడిచే వాహనాలు, ఏడు లైట్ కమర్షియల్ వాహనాలను 2030 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. తొమ్మిది ఐసీఈ ఎస్‌యూవీల్లో నూతన బ్రాండ్‌తో ఆరు మాడళ్లు కాగా, మూడు పాత బ్రాండ్లను మళ్లీ ప్రవేశపెట్టబోతున్నది. ఈ తాజా పెట్టుబడుల్లో ఆటో డివిజన్ కోసం రూ.27 వేల కోట్లు, ఐసీఈ వర్టికల్ కోసం రూ.14 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నది. ఈ నిధులతోనే దేశవ్యాప్తంగా ఉన్న ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సంస్థ వద్ద 2.2 లక్షల వాహనాల పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయని, వీటి కోసం ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఆయన చెప్పారు.