ముంబై, జూలై 21: వడ్డీరేట్లను తగ్గిస్తే దేశంలో పెట్టుబడులు పెరగబోవని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా జరిగిన ద్రవ్యసమీక్షల్లో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూపోతున్న విషయం తెలిసిందే. చివరి ద్రవ్యసమీక్షలోనైతే రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. ఈ నేపథ్యంలో రాజన్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.
నిజానికి దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్సాహపర్చడం అనేది అనేకానేక అంశాలపై ఆధారపడి ఉంటుందని, వడ్డీరేట్ల తగ్గింపు అన్న ఒక్కదానిపైనే ఆధారపడి ఉండదని పీటీఐ విడియోస్తో మాట్లాడుతూ రాజన్ అభిప్రాయపడ్డారు. ఇక కేంద్ర గణాంకాల్లో దేశంలో ప్రైవేట్ రంగ పెట్టుబడుల వాటా 11 ఏండ్ల కనిష్ఠానికి పతనమైనట్టు తేలింది. . కాగా, గతంలో దిగువ మధ్యతరగతి, గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి తగ్గింపోయిందంటూ కార్పొరేట్లు చెప్పేవారని, ఇప్పుడు ఎగువ మధ్యతరగతి వర్గాలూ ఆ జాబితాలో చేరిపోయారంటున్నారని తెలిపారు.