Infrastructure sector | న్యూఢిల్లీ, మే 31: కీలక రంగాలు కుదేలయ్యాయి. ఏప్రిల్‌లో మౌలిక రంగంలో నిస్తేజపు ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం 6 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 3.5 శాతానికే వృద్ధిరేటు పరిమితమైంది. దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితులు 8 కీలక రంగాలను కుదిపేస్తున్నాయి మరి. ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్తు, బొగ్గు, ఎరువులు, సిమెంట్, ఉక్కు తయారీల్లో సగం పడకేస్తే.. మిగతా సగం అంతంతమాత్రంగా నడుస్తుండటం ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్నది. గత ఏడాది అక్టోబర్‌లో 0.7 శాతం వృద్ధి నమోదైంది. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే అత్యంత తక్కువ వృద్ధి కనిపించింది.
భారీగా తగ్గిన ఉత్పాదకత
ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్తు రంగాల్లో ఉత్పాదకత గణనీయంగా నీరసించింది. గతంతో పోల్చితే ముడి చమురు ఉత్పత్తి మైనస్ 3.5 శాతానికి క్షీణించడం గమనార్హం. సహజ వాయువు ఉత్పత్తి కూడా మైనస్ 2.8 శాతం పడిపోయింది. రిఫైనరీ ఉత్పత్తి సైతం మైనస్ 1.5 శాతం, విద్యుదుత్పత్తి మైనస్ 1.4 శాతం మేర దిగజారింది. ఇక బొగ్గు ఉత్పత్తి ఏప్రిల్‌లో 9 శాతం క్షీణించింది. ఎరువుల ఉత్పత్తి 23.5 శాతం, ఉక్కు ఉత్పత్తి 12.1 శాతం, సిమెంట్ ఉత్పత్తి 11.6 శాతం మేర పెరిగినా.. మొత్తం ఇన్ఫ్రా సూచీని లేపలేకపోయాయి.
ఐఐపీలో 40 శాతం వాటా
ఈ ఎనిమిది కీలక రంగాల వాటా దేశ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో 40.27 శాతం. దీంతో ఈ రంగాల పనితీరునుబట్టి యావత్తు భారతీయ పారిశ్రామిక రంగాన్నే అంచనా వేయవచ్చు. నిజానికి నిరుడు ఏప్రిల్‌లో ఈ మౌలిక రంగాల వృద్ధి 9.5 శాతంగా ఉన్నది. ఈ ఏడాది మార్చిలోనూ 3.5 శాతం వృద్ధిని కనబర్చాయి. కానీ ఏప్రిల్‌లో ఆయా రంగాల్లో కార్యకలాపాలు ఏకంగా మైనస్‌లోకి జారుకున్నాయి. ఈ పరిణామం ఆందోళన కలిగించేదేనని అటు మార్కెట్, ఇటు పరిశ్రమ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.