మంగళవారం 09 మార్చి 2021
Business - Dec 31, 2020 , 01:18:20

శరవేగంగా దండు మల్కాపురం పారిశ్రామిక పార్కు పనులు

శరవేగంగా దండు మల్కాపురం పారిశ్రామిక పార్కు పనులు

శరవేగంగా దండు మల్కాపురం పారిశ్రామిక పార్కు పనులు  

ఎంఎస్‌ఎంఈల కోసం ఏర్పాటుచేసిన రాష్ట్ర ప్రభుత్వం

విదేశాలకు ఎగుమతి చేసేలా పరిశ్రమల ఉత్పత్తులు    

వందల కోట్లలో పెట్టుబడులు.. వేలాది మందికి ఉపాధి

కొంతకాలం క్రితం వరకు ఆ పరిసర ప్రాంతాల చుట్టూ గుట్టలు, చెట్లు, రాళ్లు, రప్పలు. అక్కడికి వెళ్లాలంటేనే నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. అయితే నిరుపయోగంగా ఉన్న ఈ భూమి.. ఇప్పుడు ఓ పారిశ్రామిక గని. 

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ఆదేశాలతో ఆ పరిసరాల రూపురేఖలే మారిపోయాయి. అదే దండు మల్కాపురం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పారిశ్రామిక పార్కును ఇక్కడ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్యకు ఆ భూమిని కేటాయించారు. ఇంకేముంది జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా అద్భుతమైన పారిశ్రామిక పార్కు ఏర్పాటవుతున్నది. అదికూడా దేశంలోనే భిన్నంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మితమవుతున్నది. వందల కోట్ల రూపాయల్లో పెట్టుబడులు.. వేలాది మందికి ఉపాధి.. ఇప్పుడు ఈ గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు సొంతం. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.175 కోట్లను వెచ్చిస్తున్నారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని పరిశ్రమలు ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా పూర్తిస్థాయిలో ఎంఎస్‌ఎంఈ రంగానికే ఓ గ్రీన్‌ ఇండస్ట్రీయల్‌ పార్క్‌ను తెలంగాణ ప్రభుత్వం దండు మల్కాపురంలో ఏర్పాటు చేస్తున్నది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉమ్మడి రాష్ట్రంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల కోసం చిన్న సైజు ప్లాట్లను కూడా డిజైన్‌ చేయలేదు. సొంతంగా భూములు కొనుక్కోవడం కష్టంగా మారడంతో పరిశ్రమలు అద్దెలకు, లీజులకే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ స్వరాష్ట్రంలో ఈ ఇబ్బందులకు కాలం తీరిపోయింది. దండు మల్కాపురంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)ల కోసం ఏకంగా ఓ పారిశ్రామిక పార్కునే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. 2019 నవంబర్‌ 1న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ దీనికి శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, పర్యావరణ హితంగా అభివృద్ధి చేస్తున్నారు. విస్తరణ కోసం మరో 700 ఎకరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరింది. మొత్తంగా 1,454 ఎకరాల్లో పారిశ్రామిక పార్క్‌ ఉండనుంది. మహిళా పారిశ్రామికవేత్తలకూ ప్రత్యేక భూములను కేటాయించారు.  

సకల వసతులు

ఈ పార్కు భవిష్యత్తులో 2వేల ఎకరాలకు విస్తరించనుంది. ఇక్కడి పరిశ్రమల యజమానులు, సిబ్బంది, ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా బ్యాంక్‌, ఏటీఎం, పోస్టాఫీసు, హోటల్స్‌, ఆడిటోరియం నిర్మిస్తున్నారు. నైపుణ్య శిక్షణ కేంద్రాలు, అతిథుల వసతి గృహాలతోపాటు పరిశ్రమల అవసరాల నిమిత్తం చిన్నచిన్న పరికరాలు, యంత్రాలను ఇక్కడే విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

పచ్చదనానికి ప్రాధాన్యత

ఈ ఇండస్ట్రియల్‌ పార్కులో పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. సీఎం కేసీఆర్‌ స్ఫూర్తితో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. 

వాక్‌ టూ వర్క్‌... 

సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో పారిశ్రామిక వాడలకు ఆనుకొని వాటిల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు అక్కడే నివాసం ఉండేలా టౌన్‌షిప్‌లు నిర్మించుకోవడానికి స్థలాన్ని కేటాయిస్తున్నారు. 

ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ సూక్ష్మ, చిన్న పరిశ్రమల కోసం పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయలేదు. ఆ ఆలోచన కూడా అప్పటి పాలకులకు రాలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ఎంఎస్‌ఎంఈల కోసం ప్రత్యేకంగా దండు మల్కాపురంలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేశారు. దీని ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తున్నది. స్థానికులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. 

-కొండవీటి సుధీర్‌ రెడ్డి, టీఐఎఫ్‌ అధ్యక్షుడు 

ఉత్పత్తులు ప్రారంభం

సిమెంట్‌ బ్రిక్స్‌, ప్యాకేజింగ్‌ మెటీరియల్‌ తదితర పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. మరోవైపు ఇతర పరిశ్రమల నిర్మాణాలూ చురుగ్గా సాగుతున్నాయి. ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన పరిశ్రమలూ ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో కొన్ని భారీ సంస్థలు తమ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. రాబోయే రెండు, మూడు నెలల్లో భూములు కొనుగోలు చేసిన పరిశ్రమల్లో సగానికిపైగా తమ ఉత్పత్తులను ప్రారంభించనున్నాయి.VIDEOS

logo