మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 22, 2020 , 03:38:18

దేశీయ ఆర్గానిక్‌ ఫుడ్‌ మార్కెట్‌ వృద్ధి సాలీనా 17 శాతం

దేశీయ ఆర్గానిక్‌ ఫుడ్‌ మార్కెట్‌ వృద్ధి సాలీనా 17 శాతం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: దేశంలో సేంద్రియ ఆహార (ఆర్గానిక్‌ ఫుడ్‌) మార్కెట్‌ పరిమాణం సాలీనా 17 శాతం పెరుగుతున్నదని కేంద్ర ఫుడ్‌ప్రాసెసింగ్‌శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతున్నందున దేశీయ ఆర్గానిక్‌ ఫుడ్‌ మార్కెట్‌ మరింత వేగవంతంగా వృద్ధిచెంది రానున్న ఐదేండ్లలో రూ.75 వేలకోట్లకు చేరుకునే అవకాశమున్నదని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం శుక్రవారం ఆమె కేంద్ర జౌళి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి స్మృతి ఇరానీతో కలిసి ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఆర్గానిక్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. మూడురోజులపాటు (ఆదివారం వరకు) కొనసాగే ఈ ప్రదర్శనలో 180 మందికిపైగా మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయ గ్రూపులు, సహకార సంఘాలు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో బాదల్‌ ప్రసంగిస్తూ.. సేంద్రియ ఆహార రంగంలో మహిళా పారిశ్రామికవేత్తలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్న ధ్యేయంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఏటా దేశవ్యాప్తంగా ఆరుసార్లు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తామని, రానున్న రోజుల్లో దీన్ని అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌గా మార్చాలని యోచిస్తున్నామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటులో మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముద్రా రుణాలను అందజేస్తున్నదని, నరేంద్రమోదీ ప్రభుత్వ హయాంలో ఫుడ్‌ప్రాసెసింగ్‌ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని స్మృతి ఇరానీ తెలిపారు.


logo
>>>>>>