KCR | మహబూబాబాద్ : తెలంగాణ ప్రజలను కాపాడాలని, రాష్ట్రాన్ని ఆగం కానివొద్దని పోరాటం చేస్తున్నాను అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. నా ప్రాణం ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరగనివ్వను అని హామీ ఇస్తున్నా అని కేసీఆర్ తేల్చిచెప్పారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా మహబూబాబాద్‌లో కేసీఆర్ ప్రసంగించారు.
ఈ దేశంలో నరేంద్ర మోదీ ఏమన్న పని చేసిండా..? అంటే ఏం లేదు. రూ. 15 లక్షలు ఇస్తామన్నాడు.. వచ్చాయా…? బేటీ పడావో బేటీ బచావో, అమృత్ కాల్, మన్ను కాల్.. మషానం కాల్ అన్ని నినాదలే తప్ప ఏ ఒక్క పని జరగలేదు. నరేంద్ర మోదీ గోదావరిని ఎత్తుకుని పోతా అంటే సీఎం నోరు మూసుకుని ఉన్నాడు. ఇప్పటికే కృష్ణా నదిని కేఆర్ఎంబీకి అప్పజెప్పారు. ఇవాళ ఖమ్మం పట్ణంలో మురికి నీళ్లు వస్తున్నాయి. మహబూబాబాద్ నియోజకవర్గంలో డోర్నకల్, నర్సంపేటలో భయంకరంగా మంచినీళ్ల సమస్య వస్తుంది. ఎనిమిదేండ్ల పాటు మంచిగా ఉన్న కరెంట్ ఎక్కడ..? భగీరథ ఎక్కడ పోయిందని ఆలోచించాలి. 70 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో గిరిజనులను గౌరవించలేదు. కానీ బీఆర్ఎస్ హయాంలో బంజారా భవన్, సేవాలాల్ భవన్ కట్టుకున్నాం. పది శాతం రిజర్వేషన్లు పెట్టుకున్నాం. గిరిజన తండాలన్నీ జీపీలు చేశాం. కాబట్టి గిరిజన బిడ్డలు మీ యొక్క ప్రతాపం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చూపించాలి అని కేసీఆర్ కోరారు.
రైతులకు కేసీఆర్ పదివేలు ఇస్తుండు.. మేం 15 వేలు ఇస్తమన్నడు. 15 వేలు రాలే.. పాత పది వేలు రాలేదు. ఒక్క ఉచిత బస్సు తప్ప ఆరు గ్యారెంటీలను ఆగం చేశారు. మంచినీళ్లు, కరెంట్ బాధ ఉంది. వడ్లు కొనే పరిస్థితి లేదు. వడ్లకు బోనస్ లేదు. వచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ ఎన్నికల్లో మీ అందరూ ఏకమై యువకులు, లంబాడా మేధావులు, గిరిజనులు ఆలోచనతో పని చేయాలి. ఆలోచనతో పని చేస్తే ముందుకు పోయి విజయం సాధిస్తాం. బీఆర్ఎస్ ఉన్నప్పుడ ఎట్లుండే.. కాంగ్రెస్ పాలనలో ఈ ఐదు నెలలు ఎట్లుంది అని విచక్షణతో ఆలోచించాలి. తెలంగాణ ప్రజలను కాపాడాలని, రాష్ట్రాన్ని ఆగం కానివొద్దని పోరాటం చేస్తున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరగనివ్వను అని హామీ ఇస్తున్నా. ఎన్నికల కమిషన్ నిషేధం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మాలోత్ కవిత మచ్చ లేని మనిషి.. గత ఐదేండ్లు ఎంపీగా బ్రహ్మాండంగా పని చేసింది. ఈ సారి కూడా అవకాశం ఇస్తే తెలంగాణ హక్కులు కాపాడేందుకు, నిధులు రాబట్టేందుకు, తెలంగాణను ముందుకు తీసుకుపోవడానికి మీ సేవకురాలిగా పని చేస్తది. ప్రతి క్షణం ప్రజల కోసం.. ప్రతి క్షణం ప్రగతి కోసం.. ప్రతి మాట ప్రజల కోసం.. ప్రతి అడుగు ప్రజల కోసం అన్నవిధంగా బీఆర్ఎస్ పని చేస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.