Gold Rates | న్యూఢిల్లీ, జూలై 19: కొద్ది రోజుల క్రితం రూ.58,000 స్థాయిని సమీపించిన తులం బంగారం ధర క్రమేపీ పుంజుకుంటూ బుధవారం ఒకే రోజున రూ.550 మేర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తులం 24 క్యారట్ల పుత్తడి ధర రూ.60,650 స్థాయికి చేరింది. 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.500 లాభపడి రూ.55,600 వద్ద నిలిచింది. ఢిల్లీలో 24 క్యారట్ల ధర రూ.650 మేర పెరిగి 60,700 వద్దకు పుంజుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్సు ధర ఏడు వారాల గరిష్ఠం 1,980 డాలర్లస్థాయిని దాటడంతో దేశీయ మార్కెట్లో సైతం వేగంగా లాభపడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధి చెప్పారు. యూఎస్‌లో ద్రవ్యోల్బణం 3 శాతానికి తగ్గడంతో ఫెడ్ వడ్డీ రేట్లు ఇక గరిష్ఠస్థాయికి చేరినట్టేనన్న అంచనాలతో బంగారం ధర పెరుగుతున్నదని అన్నారు.
పుత్తడిని అనుసరిస్తూ వెండి ధర కూడా పుంజుకుంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.600 వరకూ పెరిగి రూ. 82,000కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 25.05 డాలర్ల స్థాయికి పుంజుకుంది.