న్యూఢిల్లీ, అక్టోబర్ 20: భారతీయ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ‘ఎలక్ట్రిక్’ అనేది అత్యంత ఆకర్షణీయ పదం. ఏడాది కిందటిదాకా స్టార్టప్‌లే విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) పరిశ్రమలో ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం టాటా, మహీంద్రా, హ్యుందాయ్, కియా, ఎంజీ వంటి సంస్థలతోపాటు బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీ వంటి లగ్జరీ కంపెనీలు సైతం ఈవీ మార్కెట్‌పై దృష్టి సారించాయి. దీంతో ఫోర్ వీలర్ మార్కెట్లో ఈవీల వాటా గణనీయంగానే పెరిగింది.
టూవీలర్ మార్కెట్‌పైనా హీరో, బజాజ్, టీవీఎస్ వంటి ప్రధాన సంస్థలు పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో భవిష్యత్తు ఈవీలదేనని లింకెడిన్ తమ తాజా నివేదికలో అభిప్రాయపడింది. రాబోయే కొన్నేండ్లలో దేశీయ ఈవీల రంగంలో లక్షలాది ఉద్యోగావకాశాలు వస్తాయని గ్లోబల్ గ్రీన్ స్కిల్స్ రిపోర్టు 2023లో పేర్కొన్నది.
వాహన తయారీతోపాటు బ్యాటరీ, చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు డిమాండ్ పెరుగుతుందని, దీంతో వీటిల్లో కొత్త ఉద్యోగాలకు పెద్ద ఎత్తున వీలుంటుందని చెప్పింది. ఇప్పటికే అమెరికా, మెక్సికో, కెనడా, మరికొన్ని ఐరోపా దేశాలకు గట్టి పోటీనిచ్చేలా భారతీయ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఈవీ నైపుణ్య కార్మికుల సంఖ్య పెరిగిపోతున్నదని గుర్తుచేసింది.
2030కల్లా భారతీయ ఈవీల రంగంలో కోటిదాకా ప్రత్యక్ష ఉద్యోగాలు, 5 నుంచి 5.5 కోట్లదాకా పరోక్ష ఉపాధి అవకాశాలు రావచ్చని రాండ్‌స్టడ్ ఇండియా డైరెక్టర్ సంజయ్ శెట్టి అన్నారు. హీరో ఎలక్ట్రిక్ ఏవీపీ హెచ్ఆర్ మనుశర్మ, రెవిన్ వ్యవస్థాపక సీఈవో సమీర్ అగర్వాల్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. పెట్రో ఆధారిత వాహనాల వినియోగంతో కాలుష్యం పెరుగుతుండటం, వాటి నిర్వహణ వ్యయం భారంగా మారడం కూడా ఈవీల వైపు వాహనదారులు చూస్తున్నారు.