న్యూఢిల్లీ, నవంబర్ 25: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనం కాబోతున్నాయని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) ఆఖరు (2027 మార్చి 31)కల్లా బ్యారెల్ క్రూడాయిల్ రేటు 30 డాలర్లు పడిపోవచ్చని చెప్తున్నది. ఇదే గనుక జరిగితే క్రూడ్ దిగుమతులపైనే ఆధారపడుతున్న భారత్ వంటి దేశాలకు బాగా లాభించనున్నది. దేశీయ చమురు అవసరాల్లో 80 శాతానికిపైగా వివిధ దేశాల నుంచి వస్తున్న దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి మరి.
వచ్చే మూడేండ్లకుపైగా కాలంలో ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం స్థిరంగా పెరుగుతూనే ఉంటుందని జేపీ మోర్గాన్ స్పష్టం చేసింది. అయితే డిమాండ్‌కు మించి సరఫరా అవుతుండటమే ధరల పతనానికి కారణమని ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ తమ తాజా ఔట్‌లుక్‌లో పేర్కొన్నది. ముఖ్యంగా పెట్రోలియం ఎగుమతి దేశాల ఆర్గనైజేషన్ (ఒపెక్)లో భాగం కాని (నాన్-ఒపెక్) దేశాల నుంచి ముడి చమురు ఉత్పత్తి పెద్ద ఎత్తున పెరిగిపోతుందని అంటున్నది. దీనివల్ల మార్కెట్లో ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతాయని వివరిస్తున్నది. అమెరికా, బ్రెజిల్, రష్యా, కెనడా తదితర దేశాలు నాన్-ఒపెక్ కంట్రీస్గానే ఉన్నాయి. ఇక ఈ ఏడాది గ్లోబల్ ఆయిల్ డిమాండ్ రోజుకు 0.9 మిలియన్ బ్యారెళ్లకు చేరవచ్చని జేపీ మోర్గాన్ అంచనా. అయితే ఇది 2027లో రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్లుగా ఉండొచ్చని అంటున్నది.
రష్యా నుంచి భారత్ భారీగా చమురు దిగుమతుల్ని చేసుకుంటున్నది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా చమురు ఉత్పాదక సంస్థలపై అమెరికా, ఇతర యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఇవి అమల్లోకి రావడానికి ముందే భారత్‌కు ఆయా కంపెనీల నుంచి చమురు నిల్వలు వేగంగా వచ్చేస్తున్నాయి. తక్కువ ధరకే ముడి చమురును అమ్ముతుండటంతో 5 నెలల గరిష్ఠానికి చమురు దిగుమతులు ఎగిసినట్టు సమాచారం. నిజానికి రష్యా చమురును కొంటున్న భారత్, చైనాలపై అమెరికా సుంకాలను వేయగా.. కొంత మేర ఆ కోణంలో అగ్రరాజ్యం సత్ఫలితాలను సాధించింది. అయితే రష్యా ఇంకా తక్కువ ధరల్ని ఆఫర్ చేస్తుండటం గ్లోబల్ క్రూడాయిల్ మార్కెట్‌ను షేక్ చేస్తున్నది.
ఇదిలావుంటే షిప్ ట్రాకింగ్ ఏజెన్సీ కెప్లర్ వివరాల ప్రకారం ఈ నెలలో రష్యా నుంచి భారత్ చేస్తున్న చమురు కొనుగోళ్లు రోజుకు 1.855 మిలియన్ బ్యారెళ్లకు చేరవచ్చని అంచనా. అక్టోబర్‌లో రోజుకు ఇవి 1.65 మిలియన్ బ్యారెళ్లుగానే ఉన్నాయి. ఆంక్షలు అమలైతే డిసెంబర్లో దిగుమతులు పడిపోవచ్చనీ అంటున్నారు. ఇప్పటికే రిలయన్స్ సహా పలు భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి చమురును కొనడం ఆపేయగా.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం ఆంక్షలు లేని రష్యా సంస్థల నుంచే చమురును కొంటున్నట్టు చెప్తున్నాయి. ప్రస్తుతం రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, లుకాయిల్ కంపెనీలపై ఆంక్షలున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగొస్తే.. భారత్‌పై దిగుమతుల భారం గణనీయంగా తగ్గుతుంది. అంతేగాక, దేశీయ మార్కెట్లో ఇంధన ధరలు పడిపోయి.. రవాణా వ్యయం తగ్గిపోతుంది. ఇది ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురాగలదు. మార్కెట్లో వస్తూత్పత్తుల రేట్లు దిగితే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు వడ్డీరేట్లను తగ్గించేందుకు మరింత వెసులుబాటు లభిస్తుంది. ఇది ఆయా రంగాల రుణ లభ్యతకు, ఉత్పాదకతకు దోహదం చేయగలదు. ఫలితంగా ఉద్యోగాలు, వినీమయం పెరిగి చివరకు దేశ జీడీపీ పుంజుకోగలదని మెజారిటీ ఆర్థిక నిపుణుల విశ్లేషణ.