న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లలో మెగా పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధమవుతున్నది. భారతీయ టెలికాం రంగ దిగ్గజం జియో త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రాబోతున్నది. ఈ క్రమంలోనే వచ్చే నెలలో క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీకి జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ ఐపీవోకు సంబంధించిన ముసాయిదా పత్రాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) దాఖలు చేసే వీలున్నదని సమాచారం. నిజానికి గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాలతో జియో పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి డ్రాఫ్ట్ పేపర్లను ఫైలింగ్ చేయాలని రిలయన్స్ భావించింది. అయితే ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ఒడిదుడుకుల దృష్ట్యా వెనుకడుగేసింది.
అయితే ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతుండటంతో పూర్తిగా గత ఆర్థిక సంవత్సరం (2025-26) ఫలితాలను పేర్కొంటు సెబీ దగ్గరకు వెళ్లాలని రిలయన్స్ వర్గాలు చూస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకే వచ్చే వారం ప్రకటించే రిలయన్స్ ఆర్థిక ఫలితాల్లో జియో ప్రదర్శనను మరింత వివరంగా చూపవచ్చని అంటున్నారు. ఇటీవలికాలంలో జియో సబ్స్ర్కైబర్లు, దాంతోపాటే వ్యాపారం బాగా పెరిగిందని చెప్తున్నారు.
ఇదిలావుంటే దాదాపు 20 ఏండ్ల తర్వాత రిలయన్స్ ద్వారా వస్తున్న తొలి ఐపీవో ఇదే కావడం గమనార్హం. కాగా, జియో ఐపీవో.. భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్దదిగా ఉండవచ్చంటున్నారు. రూ.30-40వేల కోట్ల నిధుల సమీకరణకు అవకాశం ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ పబ్లిక్ ఇష్యూ నిర్వహణలో బడా బ్యాంకర్లు పాలుపంచుకుంటున్నారు. వీటిలో మోర్గాన్ స్టాన్లీ, జేఎం ఫైనాన్షియల్, గోల్డ్మన్ సాచ్స్, హెచ్ఎస్బీసీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, కొటక్ మహీంద్రా క్యాపిటల్ వంటి 19 బ్యాంకులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.