హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో జపాన్, తైవాన్ దేశాలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ క్లస్టర్ల ఏర్పాటు ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత బీఆర్ఎస్ సర్కారు ఈ రెండు దేశాల కంపెనీల కోసం ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినప్పటికీ.. ప్రస్తుతం అది ముందుకెళ్లడం లేదని పరిశ్రమ వర్గాలు ఆరోపిస్తున్నాయి. క్లస్టర్లలోకి బడా కంపెనీలు వస్తే.. వాటికి అనుబంధంగా అనేక యూనిట్ల ఏర్పాటుకు వీలు కలుగుతుందని, ఫలితంగా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభించే ఆస్కారం ఉందని వారు చెప్తున్నారు.
ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో జపా న్, అలాగే సెమీకండక్టర్ల పరిశ్రమలో తైవాన్ విశేషమైన ప్రగతి సాధిస్తున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు దేశాల ప్రతిభను అందిపుచ్చుకోవాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. నాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారులు దండు మల్కాపూర్ ప్రాంతంలో జపాన్ పరిశ్రమల కోసం 1,000 ఎకరాల్లో, తైవాన్ కంపెనీల కోసం మరో 1,000 ఎకరాల్లో ప్రత్యేక ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అంతేకాదు టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సమీపంలోని భూము ల సేకరణకు కూడా చర్యలు చేపట్టారు.
దండు మల్కాపూర్ ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఇప్పటికే దాదాపు 600 ఎకరాల్లో ఏర్పాటు చేయగా, మరో 600 ఎకరాల ప్రభుత్వ భూములు పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవిగాక సమీపంలోని మరో 1,000 ఎకరాలను సేకరించేందుకు గతంలో చర్యలు చేపట్టారు. వ్యవసాయ యోగ్యం కానివే ఎంపిక చేశారు. పైగా అక్కడ ఇప్పటికే ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కొనసాగుతుండటంతో దానికి సమీపంలోనే ఈ రెండు క్లస్టర్లు ఏర్పాటుచేస్తే వాటికి అనుబంధంగా మరిన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యే వీలుందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. కాగా, ప్రభుత్వం మాత్రం ఈ ప్రాంతాన్ని కాదని ఫ్యూచర్ సిటీలో కొత్తగా ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీలో వ్యవసాయ భూములను సేకరించాల్సి ఉంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమేనా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక విధానాలతోనే రాష్ట్రంలో పారిశ్రామిక ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా టీఎస్-ఐపాస్ చట్టం, అనేక ప్రోత్సాహకాలతో తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. దాదాపు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి రాగా, అనేక ప్రఖ్యాత కంపెనీలూ ఏర్పాటయ్యాయి. అయితే గత ఏడాదిన్నర కాలంగా సీన్ రివర్సైంది. దీంతో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.