ముంబై, అక్టోబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజు నష్టపోయాయి. ఆర్థిక, ఐటీ షేర్లలో భారీగా క్రయవిక్రయాలు జరగడంతోపాటు మధ్య తూర్పు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మదుపరులను అమ్మకాలవైపు నడిపించాయి. ఫలితంగా వరుసగా ఐదోరోజు బుధవారం కూడా సూచీలు ఒక్క శాతం వరకు కోల్పోయాయి.
స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 522.82 పాయింట్లు నష్టపోయి 64,049.06 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 159.60 పాయింట్లు కోల్పోయి 19,122.15 వద్ద ముగిసింది. గత ఐదు సెషన్లలో సెన్సెక్స్ 2,379 పాయింట్లు, నిఫ్టీ 690 పాయింట్లు పతనం చెందాయి.
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ షేరు ధర భారీగా నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. కంపెనీ షేరు ధర 2.76 శాతం పతనం చెందింది. భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, టాటా మోటర్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, టైటాన్, యాక్సిస్ బ్యాంక్‌లు భారీగా నష్టపోయాయి. కానీ, టాటా స్టీల్, ఎస్బీఐ, మహీంద్రాఅండ్‌మహీంద్రా, మారుతి, నెస్లెలు మాత్రం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే టెక్నాలజీ షేరు 1.39 శాతం, టెలికమ్యూనికేషన్ 1.29 శాతం, యుటిలిటీ 1.25 శాతం, ఐటీ 1.13 శాతం, పవర్ 1.09 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్టీ, బ్యాంకింగ్ రంగ సూచీలకు మదుపరుల నుంచి మద్దతు లభించలేదు.
స్టాక్ మార్కెట్ల భారీ పతనంతో మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోతున్నది. గత ఐదు సెషన్లలో మదుపరులు రూ.14.60 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో దేశీయ బ్లూచిప్ సంస్థల షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. ఫలితంగా ఐదు సెషన్లలో సెన్సెక్స్ 2,379 పాయింట్లు లేదా 3.58 శాతం నష్టపోయింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.14,60,288.82 కోట్లు కోల్పోయి రూ.3,09,22,136.31 కోట్లకు పరిమితమైంది.