న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: బీమా దిగ్గజం ఎల్ఐసీ కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నది. గడిచిన ఏడాదికాలంలో కంపెనీ షేర్లు 15 శాతం వరకు తగ్గగా, అలాగే సంస్థ పెట్టుబడులు పెట్టినదాంట్లో 70 శాతం సంస్థల షేర్లు 70 శాతం వరకు నష్టపోయాయి. తాజాగా ట్రెండ్లీనే విడుదల చేసిన డాటాలో ఈ విషయాన్ని స్పష్టంచేసింది. గతేడాది సెప్టెంబర్‌లో 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నదాంతో పోలిస్తే ప్రస్తుతం కంపెనీ షేరు 20 శాతం నష్టపోయింది. అలాగే ఈ ఏడాది మార్చిలో 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.715.30కి పడిపోయిన విలువ ప్రస్తుతం ఈ భారీ నష్టాల నుంచి కోలుకున్నది. గడిచిన 200 రోజుల సరాసరి షేరు ధర రూ.865 స్థాయిలో ఉన్నది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.2,25,451 కోట్ల ఆదాయంపై రూ.10,957 కోట్ల నికర లాభాన్ని గడించింది.
కంపెనీ షేరు ధర రూ.850 నుంచి రూ.920 మధ్యలోనే స్వల్పకాలం పాటు కొనసాగనున్నదని, భవిష్యత్తులో రూ.1,000 మార్క్‌కు చేరుకునే అవకాశం ఉన్నదని దలాల్‌స్ట్రీట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. గడిచిన ఏడాదికాలంలో కంపెనీ పెట్టుబడులు పెట్టిన 186 సంస్థల షేర్లు 70 శాతం వరకు నష్టపోయాయి. వీటిలో 150 సూచీలు రెండంకెల స్థాయిలో పతనాన్ని మూటగట్టుకున్నాయి. వీటిలో వీఎల్ ఈ-గవర్నెన్స్ అండ్ ఐటీ సొల్యుషన్స్, ఫ్లెక్సిటఫ్ వెంచర్స్ ఇంటర్నేషనల్, ఈజీ ట్రిప్ ప్లానర్స్, జైప్రకాశ్ అసోసియేట్, వాక్రెంజ్, సిమెన్స్, జై కార్ప్ షేర్లు 50 శాతానికి పైగా నష్టపోయాయి. 13 షేర్లు 40 శాతం నుంచి 50 శాతం వరకు పతనం చెందాయి. వీటిలో పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఇండస్ఇండ్ బ్యాంకులు ఉన్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాల బాటపడుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం మదుపరుల్లో ఉత్సాహన్ని నింపింది. ఫలితంగా 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిసింది. ఇంట్రాడేలో 200 పాయింట్లకు పెరిగిన సూచీ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 123.58 పాయింట్లు అందుకొని 81,548.73 వద్ద నిలిచింది. దీంతోపాటు నిఫ్టీ మూడు వారాల గరిష్ఠ స్థాయి 25 వేల కీలక మైలురాయిని అధిగమించింది.
చివరకు 32.40 పాయింట్లు అందుకొని 25,005.50 వద్ద స్థిరపడింది. గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 837.97 పాయింట్లు, గత ఏడు రోజుల్లో నిఫ్టీ 290.45 పాయింట్లు ఎగబాకినట్టు అయ్యాయి. ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, ఎటర్నల్, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, ఇన్ఫోసిస్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.