Insurance | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: సైబర్ మోసాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీనే ఆసరాగా తీసుకొని సైబర్ నేరగాళ్లు దాడులకు తెగబడుతున్నారు. దీంతో బాధితులకు రక్షణే లేకుండాపోతున్నది. అందుకే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పుడు ఈ కోణంలో దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయా బీమా సంస్థలు.. సైబర్ మోసాలకు రక్షణగా సాషే ప్రోడక్ట్స్‌ను పరిచయం చేస్తున్నాయి. ఈ రిస్క్ కవరేజీలు కేవలం రోజుకు రూ.3కే లభిస్తుండటం విశేషం. వ్యక్తులు, వ్యాపార సంస్థల అవసరాలకు తగ్గట్టుగా ఈ చిన్న ప్లాన్లను ఇన్సూరర్లు రూపొందిస్తున్నారు.
ఏఐ వినియోగంతో..
మోసగాళ్ల చేతికి సాంకేతిక పరిజ్ఞానం చిక్కితే జరిగే నష్టం అపారం. ఇప్పుడు సైబర్ ప్రపంచంలో కృత్రిమ మేథస్సు (ఏఐ)తో మోసగాళ్లు చేస్తున్నదిదే. జెన్ఏఐ సాయంతో నకిలీ వీడియోలు, వాయిస్ క్లోనింగ్‌లు, టెక్స్ సందేశాలు, ఎస్ఎంఎస్ ఫిషింగ్, ఫ్రాడ్ కాల్స్, ఫేస్ మార్ఫింగ్, ఓటీపీ చోరీలకు దిగుతున్నారు. వీటితో వ్యక్తులు, సంస్థలను బెదిరిస్తూ అక్రమాలకు తెగబడుతున్నారని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ పార్థనీల్ ఘోష్ అన్నారు. ఈ సంస్థ ఇప్పటికే మాల్వేర్, రాన్సమ్వేర్ సైబర్ దాడులను ఎదుర్కొనేలా వ్యక్తులు, వ్యాపార సంస్థల కోసం ఓ సైబర్ సాషే ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చింది.
పెరుగుతున్న మార్కెట్ విలువ
భారతీయ సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్ విలువ 2023లో 50-60 మిలియన్ డాలర్లుగా ఉన్నది. అయితే ఇది రాబోయే ఐదేండ్లలో 27-30 శాతం వృద్ధి చెందవచ్చని డెలాయిట్ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో అంచనా వేసింది. ఇందుకు తగ్గట్టుగానే ఎస్బీఐ జనరల్, హెచ్డీఎఫ్సీ ఎర్గో, ఐసీఐసీఐ లాంబార్డ్‌లు సైబర్ రిస్క్ కవరేజీ ప్లాన్లను తీసుకొస్తున్నాయి. కాగా, జెన్ఏఐ దన్నుతో జరుగుతున్న మోసాల వల్ల ఆర్థికపరమైన నష్టమేగాక సంస్థల పరపతి, వ్యక్తుల పరువు-ప్రతిష్ఠలూ దెబ్బతింటున్నాయని ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కంపెనీ లాక్టోన్ ఇండియా సీఈవో సందీప్ దాడియా అన్నారు. బలమైన లీగల్ ప్రొటెక్షన్ కోసం ఓ డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ చట్టాన్నీ తేవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తిగత సమాచార చోరీకి కంపెనీలదే బాధ్యతన్నారు.
జాగ్రత్తలు అవసరం
పెరుగుతున్న సైబర్ దాడుల నేపథ్యంలో అంతా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఏఐ ఆధారిత టెక్నాలజీతో నకిలీ మాయాజాలం నడుస్తున్నదని, అన్ని రకాలుగా నష్టపరుస్తున్నారంటున్నారు. అందుకే ఆన్లైన్లో ఉన్నప్పుడు చాలాచాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అనవసరపు లింక్స్‌పై క్లిక్ చేయవద్దని, అపరిచితుల కాల్స్, మెసేజ్‌లకు స్పందించకపోవడమే ఉత్తమమంటున్నారు. వ్యక్తిగత ఫోటోలను సైతం తరచూ ఆన్లైన్, సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయవద్దని, కొత్తకొత్త యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవద్దని కూడా హెచ్చరిస్తున్నారు. విలువైన సమాచారాన్ని (బ్యాంక్ ఖాతా నెంబర్లు, ఓటీపీలు, పాస్వర్డ్లు) స్మార్ట్ఫోన్లలో సేవ్ చేసుకోవడం, ఈ-మెయిల్స్‌లో పంపించుకోవడం మానేయడం మంచిదనీ సైబర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
ఏమిటీ సాషే ఇన్సూరెన్స్
సాషే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అంటే చిన్న పరిమాణంలో ఉండే బీమా పాలసీలు. సాధారణంగా ఇవి ప్రయాణం, దొంగతనం, గృహోపకరణాలు, ఫిట్నెస్ వంటి కొన్ని అంశాలకు సంబంధించి రూపొందుతాయి. ఇంకా చెప్పాలంటే పరిమిత శ్రేణిలో, తాత్కాలిక రక్షణే లక్ష్యంగా ఈ బీమా పాలసీలుంటాయి. సంప్రదాయ ఇన్సూరెన్స్ పాలసీలైతే జీవిత, ఆరోగ్య, ఆస్తుల వంటి అంశాలపై సమగ్ర రీతిలో లభిస్తాయి.
ఏయే కవరేజీలు?
ఐడెంటిటీ చోరీ, సైబర్ స్టాకింగ్, ఫిషింగ్, ఈ-మెయిల్ స్పూఫింగ్, సైబర్ దోపిడి, నిధుల దొంగతనం, డాటా అపహరణ వంటి వాటికి ఈ బీమా రక్షణ కల్పిస్తుంది. న్యాయపరమైన వ్యవహారా ల్లో ఖర్చులను బీమా సంస్థలే ఇస్తాయి.