Industrial Growth | న్యూఢిల్లీ, జూన్ 12: దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 3 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 5 శాతానికే పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) పరిమితమైంది. ఈ మేరకు బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో తేలింది. దీన్నిబట్టి గనులు, విద్యుత్తు రంగాల ప్రదర్శన బాగున్నా.. కీలకమైన తయారీ రంగం తీరు పేలవంగా ఉండటమే ఐఐపీ క్షీణతకు కారణంగా నిలుస్తున్నది. ఈ ఏడాది మార్చిలో 5.4 శాతంగా, ఫిబ్రవరిలో 5.6 శాతంగా ఉన్న ఐఐపీ.. జనవరిలో 4.2 శాతంగానే ఉన్నది. మళ్లీ ఇప్పుడు అదే స్థాయి దరిదాపుల్లోకి ఏప్రిల్ గణాంకాలు నమోదయ్యాయి. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఐఐపీ వృద్ధిరేటు 5.9 శాతంగా ఉన్నది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23) ఇది 5.2 శాతం. ఇకపోతే గత ఏడాది ఏప్రిల్‌లో ఐఐపీ 4.6 శాతంగా నమోదైందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఈసారి ఏప్రిల్‌లో పెరిగినట్టే కనిపిస్తున్నది. కానీ గత మూడు నెలలుగా క్రమేణా గణాంకాలు తగ్గుముఖం పడుతుండటం మాత్రం ఒకింత ఆందోళననే కలిగిస్తున్నది.
తాజా గణాంకాల ప్రకారం.. నిరుడు ఏప్రిల్‌తో పోల్చితే ఈ ఏప్రిల్‌లో గనుల రంగంలో ఉత్పాదకత వృద్ధి 6.7 శాతానికి పెరిగింది. నాడు 5.1 శాతమే. అలాగే విద్యుదుత్పత్తి కూడా 1.1 శాతం నుంచి 10.2 శాతానికి ఎగిసింది. అయితే తయారీ రంగంలో వృద్ధిరేటు ఏప్రిల్‌లో 3.9 శాతానికి క్షీణించింది. పోయినసారి ఏప్రిల్‌లో 5.5 శాతంగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఐఐపీ ఓవరాల్ గ్రోత్ దెబ్బతిన్నది. దీనికితోడు క్యాపిటల్ గూడ్స్ విభాగం వృద్ధి సైతం 3.1 శాతానికి పతనమైంది. ఏడాది క్రిందట 4.4 శాతంగా ఉన్నదిది. కన్జ్యూమర్ నాన్-డ్యూరబుల్ గూడ్స్ ఉత్పత్తి కూడా మైనస్ 2.4 శాతంలోకి దిగజారింది. నిరుడు ఏప్రిల్‌లో 11.4 శాతం వృద్ధి కనిపించింది. అందుకే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి 9.8 శాతానికి పుంజుకున్నా ఫలితం లేకపోయింది. నిజానికిది పోయినసారి మైనస్ 2.3 శాతంలో ఉన్నది. మౌలిక, నిర్మాణ రంగాల్లో వృద్ధిరేటూ 8 శాతంగానే ఉన్నది. నిరుడు ఏప్రిల్‌లో 13.4 శాతం. ఇక ప్రైమరీ గూడ్స్ ఉత్పాదక రేటు 1.9 శాతం నుంచి 7 శాతానికి, ఇంటర్మీడియెట్ గూడ్స్ గ్రోత్ 1.7 శాతం నుంచి 3.2 శాతానికి పెరిగినా ఐఐపీని గతంతో పోల్చితే పెంచలేకపోయాయి.
రిటైల్ ద్రవ్యోల్బణం గత నెల స్వల్పంగా తగ్గింది. మే నెలలో 4.75 శాతంగా నమోదైంది. బుధవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 4.83 శాతంగా ఉన్నది. అయితే నిరుడు మే నెలలో 4.31 శాతంగానే ఉన్నది. దీన్నిబట్టి ఈసారి అర శాతంపైనే పెరిగినైట్టెంది. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గరిష్ఠ ద్రవ్యోల్బణం స్థాయి 6 శాతం. కానీ ఆమోదయోగ్య స్థాయి 4 శాతమే. దీంతో ప్రస్తుత గణాంకాలు ఇంకా తగ్గాల్సి ఉన్నది. అప్పుడే వడ్డీరేట్లను తగ్గిస్తామని గత వారం జరిగిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేసినది తెలిసిందే. నిరుడు ఏప్రిల్ నుంచి కీలక వడ్డీరేట్లు యథాతథంగానే కొనసాగుతున్నాయి. చివరిసారిగా గత ఏడాది ఫిబ్రవరిలో వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచింది. ఇక అప్పట్నుంచి రెపోరేటు 6.5 శాతం వద్దే ఉన్నది. ఫలితంగా గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణాల భారం రుణగ్రహీతలపై పడుతూనే ఉన్నది. ఇదిలావుంటే మే నెలలో ఆహార ద్రవ్యోల్బణం 8.69 శాతంగా ఉన్నది. ఏప్రిల్‌లో ఇది 8.70 శాతంగా ఉన్నట్టు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) తెలిపింది.