ముంబై, డిసెంబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగిన సూచీలు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, ఫార్మా షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ ఫలితాలు దేశీయ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో వరుసగా రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలు మంగళవారం నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 42.64 పాయింట్లు కోల్పోయి 85,524.84 వద్ద ముగిసింది. 85,705 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సూచీ ఇంట్రాడేలో 85,343 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. అలాగే మరో సూచీ నిఫ్టీ మాత్రం స్వల్పంగా 4.75 పాయింట్లు పెరిగి 26,177.15 పాయింట్ల వద్ద ముగిసింది. మెటల్, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ రంగ షేర్లకు కొనుగోలుదారుల నుంచి మద్దతు లభించగా..ఐటీ, ఫార్మా రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, సన్‌ఫార్మా షేర్లు నష్టపోయాయి.