ముంబై, ఫిబ్రవరి 25: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి మళ్లాయి. వరుసగా ఐదు రోజులుగా పతనమైన సూచీలకు ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ షేర్ల నుంచి లభించిన మద్దతుతో తిరిగి కోలుకున్నాయి. ఇంట్రాడేలో 300 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 147.71 పాయింట్ల లాభంతో 74,602 వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ మాత్రం వరుసగా ఆరోరోజూ నష్టపోయింది. 5.80 పాయింట్లు కోల్పోయి 22,547.55 వద్దకు జారుకున్నది. ఫార్మా, మెటల్, ఐటీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో సూచీ తగ్గుముఖం పట్టింది.
మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా 2.61 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. భారతీ ఎయిర్టెల్ 2.55 శాతం బలపడింది. దీంతోపాటు జొమాటో, నెస్లె, బజాజ్ ఫిన్సర్వ్, మారుతి, టైటాన్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయంట్స్, టాటా మోటర్స్ షేర్లు నష్టపోయాయి. గత ఐదు సెషన్లలో సెన్సెక్స్ 1,542.45 పాయింట్లు లేదా 2 శాతం మేర నష్టపోయిన విషయం తెలిసిందే.