SBI On Capita Income | వచ్చే 24 ఏండ్లలో అంటే 2047 నాటికి దేశ పౌరుల తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతుందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేండ్లు పూర్తవుతాయి. గతేడాది (2022-23)లో రూ.2 లక్షలుగా ఉన్న వ్యక్తిగత తలసరి ఆదాయం.. శత స్వాతంత్య్ర దినోత్సవం (2047) కల్లా రూ.14.9 లక్షలకు పెరుగుతుందని ఆ నివేదిక సారాంశం. 2047 నాటికి పౌరుల వ్యక్తిగత తలసరి ఆదాయం 7.50 రెట్లు పెరుగనున్నదని ఎస్బీఐ రీసెర్చ్ ఆర్థికవేత్తలు అంచనా వేశారు.
2021-22లో పన్ను చెల్లింపు దారుల సగటు ఆదాయం రూ.13 లక్షలైతే.. 2047కల్లా రూ.49.9 లక్షలకు చేరుతుందని ఎస్బీఐ రీసెర్చ్ ఆర్థికవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఆదాయం తక్కువగా ఉన్న వర్గాలు అధికాదాయ వర్గాలుగా మారతారని అన్నారు. ఐటీ పే చేస్తున్న పన్ను చెల్లింపుదారులు 8.50 కోట్ల నుంచి 48.2 కోట్లకు చేరుతుందని కూడా అంచనా వేసినట్లు ఆ నివేదిక తెలిపింది.
పన్ను పరిధిలోకి వచ్చే శ్రామికులు 22.4 శాతం ఉంటే శత స్వాతంత్య్ర దినోత్సవం నాటికి 85.3 శాతానికి చేరుతారని అంచనా వేశారు. ఇక జీరో టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవారి సంఖ్య మరో 25 శాతం తగ్గుతుందని ఐటీ విభాగం భావిస్తున్నది. 2010-11 నుంచి 2021-22 మధ్య 13.6 శాతం మంది రూ.5 లక్షల్లోపు ఆదాయ వర్గం నుంచి బయటకు వచ్చారని, 8.1 శాతం మంది రూ.5-10 లక్షలు, 3.8 శాతం మంది రూ.10-20 లక్షల ఆదాయ వర్గం జాబితాలో చేరిపోయారని ఆ నివేదిక తెలిపింది.
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ.. 2047 నాటికి నిర్దేశిత ఆర్థిక లక్ష్యాలు సాధించాలంటే వచ్చే ఐదేండ్లు చాలా కీలకం అని అన్నారు. 2047 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. అభివ్రుద్ధి చెందుతున్న వ్యవస్థ నుంచి అభివ్రుద్ధి చెందిన వ్యవస్థగా మారాలని కూడా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.