Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాలబాటలో నడుస్తున్నాయి. వరుసగా నాలుగో సెషన్లోనూ ఇన్వెస్టర్లు లాభపడ్డారు. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ రెండూ లాభాల్లోనూ ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 347.14 పాయింట్లు పెరిగి 77,155.62 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 96.55 పాయింట్లు పెరిగి 24,085.70 వద్ద ముగిశాయి. నిఫ్టీ మైక్రోక్యాప్ 250 ఫేర్లు 1.09 శాతం, నిఫ్టీ ఆటో షేర్లు 0.62 శాతం నష్టపోయాయి.
అయితే, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 2.11 శాతం లాభపడింది. ఉదయం నుంచి ట్రేడింగ్ లాభాలబాటలోనే నడిచింది. బీఎస్ఈ30 సూచీలో భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్, టాటాస్టీల్, ఎటర్నల్, టైటాన్, ఇన్ఫోసిస్ లాభాలు పొందగా, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, ఏసియన్ పెయింట్స్, అల్ట్రా సిమెంట్, మారుతి షేర్లు నష్టపోయాయి. ఐడీబీఐ బ్యాంక్ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఒక దశలో 18 శాతం లాభపడగా, చివరకు 16 శాతం లాభంతో ముగిసింది. అలాగే, టాటా మోటార్స్ ప్యాసింజర్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఒక దశలో 10 శాతం నష్టపోగా, చివరకు 8.10 నష్టంతో ముగిసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నాయి. ఈ రోజు బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 79 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అలాగే, ఔన్స్ బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో 4329 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
భారత రూపాయి 1.2 శాతం బలపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.52గా ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం, హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకోనుండటం, చమురు ధరలు తగ్గడం మార్కెట్లో సానుకూల ఫలితాలకు కారణమైంది. అలాగే, వడ్డీ రేట్లపై అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తీసుకోనున్న నిర్ణయంపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు.