న్యూఢిల్లీ, నవంబర్ 3: అమెరికా టారిఫ్‌ల (Trump Tariffs) జాబితాలో ఇప్పుడు భారత్‌దే అగ్రస్థానం. నిన్నమొన్నటిదాకా చైనాపై (China) అత్యధిక సుంకాలు వేసిన ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెనక్కి తగ్గారు. డ్రాగన్‌తో దోస్తీ కుదరడంతో అమెరికాలోకి దిగుమతయ్యే చైనా వస్తూత్పత్తులపై 57 శాతం పడుతున్న సుంకాలను 47 శాతానికి తగ్గించారు. ఇందుకోసం ఫెంటానిల్ తయారీకి వినియోగించే చైనా రసాయనాలపై వేస్తున్న 20 శాతం సుంకాలను 10 శాతానికి కుదించారు. అంతేగాక 100 శాతం టారిఫ్‌లు విధించాలన్న ఆలోచననూ ట్రంప్ సర్కారు విరమించుకున్నది. గత వారం దక్షిణ కొరియాలోని బసన్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ తర్వాత అగ్రరాజ్య విదేశాంగ విధానమే మారిపోయింది మరి. ఇరు దేశాల మధ్య కుదిరిన పలు కీలక ఒప్పందాలు అమెరికా-చైనా ఉద్రిక్తతల్ని ఒక్కసారిగా శాంతింపజేశాయి. ఈ క్రమంలో ఇప్పుడు భారత్‌పైనే అమెరికా సుంకాలు అత్యధికంగా పడుతున్నట్టవుతున్నది.
ఇదీ సంగతి..
ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలోకి దిగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులపై 50 శాతం టారిఫ్‌లను ట్రంప్ వేసిన విషయం తెలిసిందే. తమ దేశంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి ఆలస్యం చేస్తున్నదన్న ఆగ్రహంతో 25 శాతం, తమ మాటను కాదని రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడి చమురును కొనడాన్ని తప్పుబడుతూ మరో 25 శాతం.. మొత్తంగా 50 శాతం సుంకాలను ట్రంప్ సర్కారు అమల్లోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికాతో మైత్రి.. చైనా టారిఫ్‌ల భారాన్ని తగ్గించింది. దీంతో ఇప్పుడు చైనాపై 47 శాతానికి పరిమితమైన సుంకాలు.. భారత్‌పై మాత్రం 50 శాతంగా ఉంటున్నాయి. అంతేగాక భారత్, పాక్ ఘర్షణలు వీడకపోతే 250 శాతం సుంకాలు పడుతాయని హెచ్చరించిన విషయం తెలిసిందే.
మోదీతో చెడిన స్నేహం
నిజానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో డొనాల్డ్ ట్రంప్‌కు మంచి స్నేహ సంబంధాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే గత బైడెన్ సర్కారుతో అంటీముట్టనట్టుగా ఉంటూ వచ్చిన మోదీ.. తర్వాత జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతిచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన ట్రంప్.. ఇప్పుడు భారత్‌పై విషం కక్కుతున్నారు. హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడమేగాక, టారిఫ్ వార్‌కు సిద్ధపడ్డారు. అప్పట్నుంచి మోదీ, ట్రంప్ మధ్య విభేదాలు ఏర్పడగా.. సహజంగానే భారత్-అమెరికా నడుమ కూడా సంబంధాలు దెబ్బతిన్నాయి. నిజానికి అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ ఉన్న దగ్గర్నుంచి.. ట్రంప్ తొలిసారి ప్రెసిడెంట్ అయినంత వరకు భారత్‌తో మైత్రి బాగానే సాగింది. కానీ రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాతే ట్రంప్ నిర్ణయాల్లో దూకుడు పెరిగింది. ఇది భారత్‌ను ఇబ్బందిపెడుతుండగా, ఇక్కడి వ్యాపార, పారిశ్రామిక వర్గాలకూ నష్టదాయకంగా పరిణమించింది.
ప్రపంచ ఎకానమీకి దెబ్బ
భారత్-అమెరికా మైత్రి దెబ్బతినడం.. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థల్నేగాక, ప్రపంచ ఎకానమీని కూడా ప్రభావితం చేయగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సూపర్ పవర్‌గా ఎదుగుతున్న భారత్‌కు కొన్ని ప్రతిబంధకాలు ఎదురయ్యే వీలుందంటున్నారు. అయితే ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు.. అసలే ఇబ్బందుల్లో ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత ఇరకాటంలోకి నెట్టే అవకాశాలూ లేకపోలేదని చెప్తున్నారు. అవకాశం దొరికితే భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూసే చైనా, పాకిస్తాన్లకు ట్రంప్ దగ్గరవుతుండటం కూడా అమెరికాతో సంబంధాలను బలహీనపరుస్తుండగా.. ఈ నేపథ్యంలో రష్యాతో మైత్రికే మోదీ సర్కారు పెద్దపీట వేయాల్సి వస్తున్నదని చెప్తున్నవారూ ఉన్నారు. మొత్తానికి అమెరికా-భారత్ వాణిజ్య యుద్ధం ముదిరితే ఔషధ, ఐటీ, ఆటో, ఎలక్ట్రానిక్ తదితర రంగాలకు గడ్డు పరిస్థితులేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇరు దేశాలకూ నష్టమేనని చెప్పక తప్పదు.