Raghuram Rajan | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 : ఇటీవలికాలంలో బలహీనపడ్డ భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆర్బీఐ, ఇంకోవైపు ఆయా రేటింగ్ ఏజెన్సీలు కూడా ఇదే అంచనాల్ని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈసారి జీడీపీ వృద్ధిరేటు అంచనాలను కూడా పెంచుతున్నాయి. అయితే ఈ అంచనాలు ఏమంత గొప్పగా లేవని రాజన్ పెదవి విరిచారు. ప్రస్తుతం చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాజన్.. తాజాగా ఓ బ్లూంబర్గ్ టెలివిజన్ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ.. దేశ జీడీపీ గాడినపడుతున్నదని ఆనందించాల్సిన అవసరం లేదని, ఇప్పుడున్న వృద్ధి అంచనాలు.. కొత్తగా జాబ్ మార్కెట్లోకి రాబోయే వాళ్లకు సరిపడా ఉద్యోగాలను సృష్టించలేవని తేల్చిచెప్పారు.
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో దేశ జీడీపీ వృద్ధిరేటు 6 శాతానికిపైగానే ఉంటుందన్న అంచనాలు విస్తృతంగా వస్తున్న సంగతి విదితమే. బ్లూంబర్గ్ సర్వేలో ఆర్థికవేత్తలు సైతం ఇదే చెప్పారు. జూలై-సెప్టెంబర్‌తో పోల్చితే (నాడు ఏడు త్రైమాసికాల కనిష్ఠ స్థాయిని తాకుతూ 5.4 శాతంగా నమోదైంది) ఇది ఎక్కువే. అయినప్పటికీ భారత్ ఇంకా మెరుగైన వృద్ధిరేటును సాధించవచ్చని రాజన్ అభిప్రాయపడ్డారు. ఇంకో 2 శాతం పెరిగి 8 శాతం స్థాయిని అందుకోవాలని, అప్పుడే ఏటా మార్కెట్లోకి వస్తున్న నిరుద్యోగ యువతకు తగ్గ ఉద్యోగావకాశాలను సృష్టించగలమని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన భారత్‌కు ఇప్పుడున్న స్థాయి వృద్ధి సరికాదన్నారు. కాగా, ఈ శుక్రవారం అక్టోబర్-డిసెంబర్‌కుగాను దేశ జీడీపీ గణాంకాలు అధికారికంగా విడుదల కానున్నాయి.
మందగించిన దేశ జీడీపీ వృద్ధిరేటును పరుగులు పెట్టించేందుకు దాదాపు ఐదేండ్ల తర్వాత ఆర్బీఐ ఇటీవలి ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేటును పావు శాతం కోత పెట్టినది తెలిసిందే. ఈ నెలారంభంలో కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా రెపో రేటును 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తెచ్చారు. దీంతో ఆయా బ్యాంకులూ తమ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. అయితే ఎకానమీని బలపర్చేందుకు ఈ నిర్ణయం ఒక్కటే చాలదని రాజన్ వ్యాఖ్యానించారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి దోహదం చేసే చర్యలు కూడా తీసుకోవాల్సి ఉందన్నారు. ఉద్యోగావకాశాలు ఎంతగా పెరిగితే ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు అంత గట్టిగా సాగుతున్నట్టవుతుందన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తమ దేశంలోకి దిగుమతయ్యే వస్తు,సేవలపై అధిక సుంకాలను ప్రకటిస్తున్నది చూస్తూనే ఉన్నాం. ఈ కారణంగానే దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. అయితే ఈ సుంకాలపై రాజన్ స్పందిస్తూ.. అమెరికాతో సత్సంబంధాలు లాభదాయకమని, ఆ దేశం నుంచి చమురు, రక్షణపరమైన కొనుగోళ్లను పెంచడం మంచిదని అభిప్రాయపడ్డారు. అలాగే చాలా వస్తూత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గించే వీలుందన్నారు. నిజానికి దీనివల్ల దేశ వృద్ధిరేటు ప్రగతికి వచ్చే నష్టమేమీ లేదన్న ఆయన.. పైగా పరిశ్రమలో పోటీ వాతావరణం నెలకొంటుందని, అది మంచిదేనని వ్యాఖ్యానించారు. ఇక ఆర్బీఐ గవర్నర్‌గా 2013 నుంచి 2016 వరకు రాజన్ పనిచేశారు.