ప్రవీణ్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. రాబడులను పెంచుకోవడానికి తన ఈపీఎఫ్‌వో ఖాతా నుంచి ఎన్పీఎస్కు నిధులను బదిలీ చేసుకోవాలనుకుంటున్నాడు. నిజానికి ఇంకా 10 సంవత్సరాల సర్వీస్ ఉన్నది. కానీ ఇది సాధ్యమేనా? అన్న సందేహాలతో సతమతమైపోతున్నాడు. ఒకవేళ సాధ్యమే అయితే అందుకున్న ప్రక్రియ ఏమిటి? పన్నుల భారం ఏమైనా ఉంటుందా? మరి నిపుణులు ఏమంటున్నారు..
NPS | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఖాతా నుంచి నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్)కు ఉద్యోగులు తమ నిధులను బదిలీ చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. పైగా ఎన్పీఎస్ టైర్ 1 ఖాతాకు ఈపీఎఫ్ నిధి ఏకకాల బదిలీ.. ఎన్పీఎస్కు విరాళంగా పరిగణించలేరు కాబట్టి ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 10(12) కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. అయితే ఇందుకు మీకు ఓ క్రియాశీల ఎన్పీఎస్ టైర్ 1 ఖాతా అవసరం. దీర్ఘకాల రిటైర్మెంట్ సేవింగ్స్ కోసం రూపొందించబడినదే ఈ ఎన్పీఎస్ టైర్ 1 అకౌంట్. ఈ ఖాతాదారులకు చెప్పుకోదగ్గ స్థాయిలో పన్ను ప్రయోజనాలూ ఉంటాయి.
దీని వడ్డీకి పన్ను మినహాయింపుంటుంది. సెక్షన్ 10(12ఏ) కింద 60 శాతం పీఎఫ్ నిధికి పన్నులు చెల్లించనక్కర్లేదు. మిగతా 40 శాతాన్ని ఆదాయ పన్నులనుబట్టి యాన్యుటీ ప్లాన్‌లో తిరిగి పెట్టుబడిగా పెట్టుకోవచ్చు. మీరు ఉద్యోగం చేస్తున్న కంపెనీ ద్వారానే ఈ ఖాతాను పొందవచ్చు. అలాకాకపోతే పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ (పీవోపీ) లేదా ఈఎన్పీఎస్ పోర్టల్ ద్వారా పనిచేసుకోవచ్చు. ఇక ఎన్పీఎస్కు ఈపీఎఫ్‌వో ఖాతా నుంచి నిధుల బదిలీకి మీరు ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీ ద్వారా రికగ్నైజ్డ్ ఈపీఎఫ్‌కు ఓ బదిలీ విజ్ఞప్తిని సమర్పించాల్సి ఉంటుంది.
ఈపీఎఫ్‌వో ఖాతా నుంచి ఎన్పీఎస్కు నిధులను మళ్లించే ముందు మీరు మీ ఆర్థిక పరిస్థితుల్ని, లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటే లాభదాయకం. ఈపీఎఫ్‌కు అదనంగా స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో మీకు పెట్టుబడులున్నైట్టెతే ఈపీఎఫ్ నిధులను అలాగే ఉంచుకోవడం ఉత్తమమని చెప్పవచ్చు. ఎందుకంటే మీ పదవీ విరమణ సమయంలో ఈ నిధులు మీకు మరింత దన్నుగా నిలుస్తాయి. అయితే మీ రిటైర్మెంట్ లక్ష్యానికి తగ్గట్టుగా ఈక్విటీ సాధనాలకు కేటాయింపులను పెంచుకోవచ్చు. అందుకు నిధుల కొరత ఉంటే.. ఎన్పీఎస్కు మారడాన్ని పరిశీలించవచ్చు. ఇక మీ ఈక్విటీ పెట్టుబడులు కేవలం 20 శాతం దరిదాపుల్లోనే ఉంటే ‘ఆటో’ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. వయసు పెరుగుతున్నాకొద్ది అవి 10-15 శాతానికి దిగొస్తాయి. ఒకవేళ ‘యాక్టీవ్’ ఆప్షన్‌ను ఎంచుకొంటే 50 ఏండ్లదాకా 75 శాతం వరకు, 60 ఏండ్లకల్లా 50 శాతానికి తగ్గుతాయి.
దినేశ్ వయసు 40 ఏండ్లు. పైండ్లె, ఇద్దరు పిల్లలున్నారు. ఒకరికి 10 ఏండ్లు, మరొకరికి ఏడాది. తన ఈక్విటీ పోర్ట్‌ఫోలియో విలువ రూ.1.6 కోట్లు (మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.50 లక్షలు, స్టాక్స్‌లో రూ.1.1 కోట్లున్నాయి). అంతేగాక ఈపీఎఫ్‌లో మరో రూ.25 లక్షలున్నాయి. ఇక రూ.80 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్, తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీ ద్వారా రూ.30 లక్షల కుటుంబ ఆరోగ్య బీమాను కలిగి ఉన్నాడు. కాగా, స్మాల్-క్యాప్ ఈటీఎఫ్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా నెలనెలా రూ.50,000 కడుతున్నాడు. అలాగే నెలవారీ ఖర్చులు రూ.70,000. అయితే 58 ఏండ్లకు రిటైర్ అవ్వాలని చూస్తుండగా.. ఇదే రీతిలో పెట్టుబడులు, ఆదాయం ఉంటే సాధ్యమేనా? అని ఆలోచిస్తున్నాడు. మరి నిపుణులు ఏం చెప్తున్నారు?
6 శాతం ద్రవ్యోల్బణంతో ఇప్పుడున్న మీ నెలవారీ రూ.70,000 ఖర్చు.. మీకు 58 ఏండ్లు వచ్చేసరికి రూ.2 లక్షలకు పెరుగుతుంది. కనుక 58 ఏండ్లు దాటిన తర్వాత ఉండే వ్యయాన్ని అందుకోవాలంటే రూ.9 కోట్ల నిధి అవసరం. ఇక ఇప్పుడున్న ఈపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ పెట్టుబడులు ఏటా 12 శాతం రాబడుల్ని పంచినా.. అప్పటికల్లా దాదాపు రూ.17 కోట్ల నిధిని ఏర్పర్చగలవు. పిల్లల చదువు ఖర్చుల్ని పరిగణనలోకి తీసుకున్నా.. ప్రస్తుతానికైతే లక్ష్య సాధనలో సరైన మార్గంలోనే వెళ్తున్నారని చెప్పవచ్చు. అయితే సింగిల్ స్మాల్-క్యాప్ ఈటీఎఫ్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. కాబట్టి వేర్వేరు మార్కెట్ క్యాప్స్‌లో సిప్‌లకు ప్రయత్నించండి. ఇక ఇప్పటికైతే బీమా కవరేజీ భేష్. కానీ ఉద్యోగం వదిలేసిన తర్వాత ఈ ఆరోగ్య బీమా సరిపోతుందా? అన్నది ఆలోచించండి. చివరగా ఏడాదికోసారైనా మీ పోర్ట్‌ఫోలియో, లక్ష్యాలను సమీక్షించుకోవడం మంచిది.