హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): అమెరికాలో స్థిరపడిన రాష్ట్ర ప్రజలు న్యూయార్క్‌తో పోల్చుకునేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఆసియా పసిఫిక్ సీఈవో మ్యాథ్యూ భౌ ప్రతినిధి బృందం మంగళవారం సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యింది. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా వృద్ధి చెందుతున్న తీరు, వివిధ రంగాలు విస్తరిస్తున్న తీరుపై వారు చర్చించారు.
తమ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు రూట్ విస్తరణతో హైదరాబాద్ మరింత అద్భుతంగా తయారుకానున్నదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాము దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడటం లేదని, హైదరాబాద్‌ను ప్రపంచంలో పేరొందిన నగరాల సరసన నిలబెట్టాలనేది తమ సంకల్పమన్నారు.
ఈ సందర్భంగా మ్యాథ్యూ భౌ మాట్లాడుతూ.. దేశంలోనే హైదరాబాద్ శరవేగంగా వృద్ధి చెందుతున్నదని, గత ఆరు నెలల్లో రియల్టీతోపాటు ఆఫీస్ స్థలాల లీజు, నిర్మాణం, రెసిడెన్షియల్ స్పేస్‌లోనూ గణనీయమైన వృద్ధి నమోదు చేసిందన్నారు. మరోవైపు, మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ మిస్టర్ ఫర్నాండేజ్ భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.