హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో ఇండ్ల ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి గజానికి 24 శాతం మేర పెరిగాయని ప్రముఖ రియల్టీ అధ్యయన సంస్థ అనరాక్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ స్థితిగతులు, ఇండ్ల ధరలను ప్రామాణికంగా తీసుకొని నివేదికను రూపొందించింది. గతేడాది హైదరాబాద్‌లో 47,485 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది మొత్తం 61,715 యూనిట్లు అమ్ముడైనట్లు తెలిపింది. గతేడాదితో పోలిస్తే 30 శాతం వృద్ధి నమోదైందని అనరాక్ పేర్కొంది. ప్రస్తుత నివేదికల ప్రకారం రియాల్టీ ట్రెండ్‌ను పరిశీలిస్తే వచ్చే ఏడాదిలోనూ ఇండ్ల ధరలు 8-10 శాతం పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొంది.
ఖరీదైన గృహాల క్రయవిక్రయాల్లో దేశ రాజధాని ఢిల్లీ కంటే హైదరాబాద్ ముందు వరుసలో నిలిచింది. ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్లో ముంబై అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో హైదరాబాద్, మూడో స్థానంలో ఢిల్లీ నిలిచాయని నైట్ ఫ్రాంక్ నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 11 శాతం మేర ఇండ్ల ధరలు పెరిగినట్లుగా తెలిపింది. అయితే 30 శాతం మేర ఉన్న చౌకధర ఇండ్ల కొనుగోలు స్థిరంగానే ఉండగా, అత్యంత విలాసవంతమైన ఇండ్లకు మాత్రం హైదరాబాద్‌లో గణనీయంగా డిమాండ్ పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు.