Nirmala Sitaraman | వచ్చేవారం లోక్‌సభలో నూతన ఆదాయం పన్ను బిల్లు-2025ను ప్రవేశ పెడుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆరు దశాబ్దాల నాటి పాత ఆదాయం పన్ను చట్టం స్థానంలో కొత్త బిల్లు ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. రాజ్యసభలో బిల్లును ప్రవేశ పెట్టిన తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు నూతన ఆదాయం పన్ను చట్టం వెళుతుందన్నారు. నూతన ఆదాయం పన్ను బిల్లుకు శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. ‘నిన్న (శుక్రవారం) నూతన ఆదాయం పన్ను బిల్లు ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నేను వచ్చేవారం లోక్‌సభలో బిల్లు ప్రవేశ పెడతానని ఆశాభావంతో ఉన్నా. తదుపరి పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలనకు వెళుతుంది’ అని చెప్పారు.
శనివారం ఆర్బీఐలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో సమావేశమైన తర్వాత నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసులు చేసిన తర్వాత తిరిగి మళ్లీ బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదిస్తుందన్నారు. తిరిగి మళ్లీ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశ పెడతామన్నారు. నూతన ఆదాయం పన్ను బిల్లు ఆమోదానికి మూడు కీలక దశలు ఉన్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2024 జూలైలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించినప్పుడే పాత ఆదాయం పన్ను చట్టాన్ని సమగ్రంగా సమీక్షిస్తామని ప్రకటించినట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు.
వివాదాలు, వ్యాజ్యాలు తగ్గించడంతోపాటు పన్ను చెల్లింపులో ఖచ్చితత్వం కోసం కొత్త ఆదాయం చట్టం సులభంగా అర్ధం చేసుకోవడానికి సంక్షిప్తంగా, స్పష్టంగా రూపొందించడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అంతర్గతంగా కమిటీలు వేసిందన్నారు. వేర్వేరు అంశాలను పరిశీలించడానికి 22 ప్రత్యేక సబ్ కమిటీలు పని చేశాయని తెలిపారు. కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణకు గత రెండేండ్లుగా చర్యలు తీసుకుంటున్నట్లు ఈ నెల ఒకటో తేదీన బడ్జెట్ సమర్ఫణ సందర్భంగా చెప్పారు.