Hindenburg | వాషింగ్టన్/న్యూఢిల్లీ, జనవరి 16: హిండెన్‌బర్గ్ రిసెర్చ్ మూతబడింది. అదానీ గ్రూప్‌పై సంచలనాత్మక ఆరోపణలు చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ అమెరికన్ షార్ట్ సెల్లర్.. ఇక గుడ్‌బై అంటూ దుకాణం ఎత్తేసింది. హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ గురువారం అధికారికంగా ప్రకటించారు మరి.
ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ముకేశ్ అంబానీని వెనక్కినెట్టి.. అగ్రస్థానంలో నిలబడ్డ గౌతమ్ అదానీ ఒక్కసారిగా కూలబడ్డారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆయనకు చెందిన సంస్థల షేర్లన్నీ భీకర నష్టాల్లోకి జారుకున్నాయి. గంటల వ్యవధిలో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ హరించుకుపోయింది. లక్షల కోట్ల రూపాయల నష్టాలతో అదానీ వ్యక్తిగత సంపద కూడా కనుమరుగైపోయింది. భారతీయ స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయంటూ రెండేండ్ల క్రితం విడుదలైన ఓ సంచలన నివేదికే ఇందుకు కారణం. స్టాక్ మార్కెట్లలో నమోదైన 10 అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ కేవలం నెల రోజుల్లోనే రూ.19.19 లక్షల కోట్ల నుంచి రూ.7 లక్షల కోట్లకు దిగజారింది. ఇందులో వ్యక్తిగతంగా గౌతమ్ అదానీకే దాదాపు రూ.9 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో ఈ రిపోర్టునిచ్చిన హిండెన్‌బర్గ్ పేరు దేశ, విదేశాల్లో మార్మోగిపోయింది. కాగా, హిండెన్‌బర్గ్ మూసివేత.. అదానీ, మోదీ సర్కారుకు క్లీన్‌చిట్‌గా భావించరాదని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అంటున్నది. మరోవైపు ఎందరో వచ్చారు.. ఎందరో పోయారు అంటూ అదానీ వ్యాఖ్యానించింది. అయితే స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్లు భారీ లాభాలను అందుకోవడం గమనార్హం.
హిండెన్‌బర్గ్ రిసెర్చ్‌ను 2017లో నాథన్ అండర్సన్ ప్రారంభించారు. కనెక్టీకట్ యూనివర్సిటీలో అంతర్జాతీయ వ్యాపార నిర్వహణ విద్యనభ్యసించిన ఆయన అమెరికాకు రాకముందు జెరూసలేంలో ఉండేవారు. ఓ ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ కంపెనీలో కన్సల్టింగ్ జాబ్‌ను చేసిన అండర్సన్.. కేవలం 11 మంది ఉద్యోగులతో ఇన్నాళ్లూ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ కార్యకలాపాలను నడిపించడం గమనార్హం. కాగా, అమెరికాలోని లార్డ్స్టౌన్ మోటర్స్ కార్ప్, క్లోవర్ హెల్త్, చైనాకు చెందిన కాండీ, కొలంబియా సంస్థ టెక్నోగ్లాస్లపై గతంలో హిండెన్‌బర్గ్ రిపోర్టులు పేలాయి. 2023లో ఇకాన్ ఎంటర్ప్రైజెస్, బ్లాక్ కంపెనీలనూ షార్ట్ చేసింది. ఇక అదానీ గ్రూప్‌పై విధ్వంసం తెలిసిందే. అయితే అంతకుముందే భారత్‌కు చెందిన ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థపై హిండెన్‌బర్గ్ దాడులు జరిగాయి. టార్గెట్ కంపెనీల అక్రమాలు, అంతర్గత వ్యవహారాలు, లుకలుకల్ని కనిపెట్టి రిపోర్టులను సిద్ధం చేయడమే హిండెన్‌బర్గ్ పని. ఆ తర్వాత తమ భాగస్వాములతో కలిసి అదే సంస్థల్లో షార్ట్ పొజీషన్లు తీసుకుంటుంది. ఆపై సదరు రిపోర్టులను విడుదల చేస్తుంది. దీంతో స్టాక్ మార్కెట్లలో ఆయా కంపెనీల షేర్లు పడిపోగానే లాభాల్ని చేజిక్కించుకుంటుంది.
అమెరికా ట్రేడెడ్ బాండ్లు, నాన్ ఇండియన్ ట్రేడెడ్ డెరివేటివ్ సాధనాల ద్వారా అదానీ గ్రూప్ సంస్థల్లో హిండెన్‌బర్గ్‌కు షార్ట్ పొజీషన్లున్నాయి. అదానీపై రిపోర్టుతో షార్ట్ సెల్లింగ్‌కు దిగి హిండెన్‌బర్గ్ బాగానే సంపాదించింది. కాగా, అదానీ గ్రూప్‌లోని వివిధ స్టాక్ మార్కెట్ నమోదిత కంపెనీల రుణం పెద్ద ఎత్తున ఉన్నదని, ఇది మొత్తం గ్రూప్ ఆర్థిక పరిపుష్ఠినే దెబ్బతీయగలదని హిండెన్‌బర్గ్ తమ రిపోర్టులో పేర్కొన్నది. ఈ క్రమంలో హిండెన్‌బర్గ్‌కు సెబీ నోటీసులు ఇవ్వగా, అదానీ అక్రమాల్లో సెబీ చీఫ్ మాధవీపురి బచ్ దంపతుల పాత్ర కూడా ఉందంటూ ఆ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. ఇది దేశ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. మరోవైపు అమెరికాలో అదానీపై కేసులు నమోదయ్యాయి. త్వరలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనుండటంతో దీనిపై గట్టిగానే విచారణలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిండెన్‌బర్గ్ షట్‌డౌన్ ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. విచారణల భయంతోనే మూసేశారా? అన్న సందేహాలూ తలెత్తుతున్నాయి.
మా దర్యాప్తు ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయి. చివరి కేసును ముగించిన రోజే సంస్థనూ మూసేద్దామని గతంలోనే నిర్ణయించుకున్నాం. ఆ రోజే ఈ రోజు. మా రిసెర్చ్‌లతో కొన్ని సామ్రాజ్యాలు వణికిపోయాయి. దాదాపు 100 మందిపై రెగ్యులేటర్లు నేరాభియోగాల్ని నమోదు చేశారు. వీరిలో ఎందరో బిలియనీర్లు, సామ్రాజ్యాధినేతలూ ఉన్నారు. ఇక వచ్చే 6 నెలల్లో హిండెన్‌బర్గ్ ఇన్నాళ్లూ చేసిన దర్యాప్తులు, అందుకు వినియోగించిన సాధనాలపై సమగ్ర వీడియో కథనాల్ని రూపొందించే యోచనలో ఉన్నాం. తద్వారా మేము ఎలా దర్యాప్తుల్ని చేశామో ఇతరులూ చూసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాం. నా జీవితంలో హిండెన్‌బర్గ్ ఓ గొప్ప అధ్యాయం. అయినప్పటికీ అదొక్కటే నా జీవితం కాదు. అందుకే నా వ్యక్తిగత జీవితానికీ ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాను. ఇక ఇందులో పనిచేసిన ఉద్యోగులంతా ఎంతో సమర్థులు. ఎటువంటి భేషజాలు లేకుండా కలిసిమెలిసి పనిచేశారు. వారిని అభినందిస్తున్నాను.
-నాథన్ అండర్సన్, హిండెన్‌బర్గ్ రిసెర్చ్ వ్యవస్థాకుడు