HDFC Bank | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం నికర లాభాల్లో అదరగొట్టింది. మార్కెట్ వర్గాల అంచనాలను బ్రేక్ చేస్తూ 5.3 శాతం వృద్ధితో 16,821 కోట్ల నికర లాభాలు గడించింది. నికర వడ్డీ ఆదాయం 10 శాతం వృద్ధి సాధించి రూ.30,113 కోట్లు గడించింది. మొత్తం ఆస్తులపై కీలక నికర వడ్డీ మార్చిన్ 3.46 శాతం, వడ్డీ ఆధారిత అసెట్స్ మీద 3.65 శాతం వృద్ధి సాధించింది. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు డిపాజిట్లు 15.1 శాతం పెరిగి రూ.25,00,100 కోట్లకు చేరాయి. స్థూల అడ్వాన్సులు ఏడు రికార్డు వృద్ధి సాధించి రూ.25,19,000 కోట్లకు చేరాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు స్థూల మొండి బకాయిలు 1.36 శాతానికి పెరిగాయి. ఇతర వడ్డీ ఆదాయం రూ.10,710 కోట్ల నుంచి రూ.11,480 కోట్లకు పెరిగింది. 2023 సెప్టెంబర్ నెలతో ముగిసిన నాటికి బ్యాంకు బ్యాలెన్స్ షీట్ రూ.34,16,300 కోట్ల నుంచి రూ.36,88,100 కోట్లకు పుంజుకున్నది. మొత్తం డిపాజిట్లు 15.1 శాతం వృద్ధితో రూ.25,00,100 కోట్లకు చేరాయి. పొదుపు ఖాతాలతోపాటు సీఏఎస్ఏ డిపాజిట్లు 8.1 శాతం పెరిగి రూ.6,08,100 కోట్లకు, కరంట్ ఖాతా డిపాజిట్లు రూ.2,75,400 కోట్లకు చేరుకున్నాయి. రిటైల్ రుణాలు 11.3 శాతం, కమర్షియల్ అండ్ రూరల్ రుణాలు 17.4 శాతం పెరిగితే, కార్పొరేట్, ఇతర టోకు రుణాలు 12 శాతం తగ్గాయి.