GST | న్యూఢిల్లీ, మే 1: జీఎస్టీ వసూళ్లు మరో మైలురాయికి చేరుకున్నాయి. ఏప్రిల్ నెలకుగాను రూ.2 లక్షల కోట్లకు పైగా వసూలయ్యాయి. దేశ ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉండటం, దేశీయ లావాదేవీలు అధికం కావడంతో రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇంతటి గరిష్ఠ స్థాయిలో పన్ను వసూలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1.87 లక్షల కోట్లతో పోలిస్తే 12.4 శాతం అధికమని పేర్కొంది. పన్ను అధికారుల కృషి వల్లనే ఇది సాధ్యమైందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఐజీఎస్టీ సెటిల్మెంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి బకాయిలు లేవని, ఇప్పటి వరకు ఉన్న బకాయిలన్నింటినీ చెల్లించామన్నారు. ఈ సందర్భంగా డెలాయిట్ ఇండియా పార్టనర్ ఎంఎస్ మణి మాట్లాడుతూ..ఉత్పత్తి, వినిమయ రాష్ర్టాలు అంచనాలకుమించి రాణించడం వల్లనే జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయన్నారు. భవిష్యత్తులోనూ మరింత పెరిగే అవకాశం కూడా ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. గత నెలకుగాను రూ.6,236 కోట్లు వసూలయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.5,622 కోట్లతో పోలిస్తే 11 శాతం అధికం కావడం విశేషం. అటు ఆంధ్రప్రదేశ్‌లో రూ.4,850 కోట్లు జీఎస్టీ వసూలయ్యాయి.